
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్ట్‌లు, కమీషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీపైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్ట్‌లన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఇప్పుడు కియా ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడి నుంచి తరలించుకుని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే..
పెట్టుబడులు తెచ్చే విధానం ఇదేనా?
కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదను విచ్చలవిడిగా పంచుకుని తింటున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, లిక్కర్, ఉద్యోగాలు, కాంట్రాక్టులు.. ఏదీ వదలకుండా దోచేస్తున్నారు. ఇవి చాలదంటూ పరిశ్రమలపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించారు. అన్ని పరిశ్రమల్లోనూ తమకే కాంట్రాక్ట్‌లు, కమిషన్లు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.
రాయలసీమలో పలువురికి ఉపాధిని కల్పిస్తున్న కియా కంపెనీపైనా ఇదే తరహాలో వేధింపులు ప్రారంభించారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా బెదిరించి, బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం మారగానే గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్‌లను తొలగించి, తమకు చెందిన వారికే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి కియాను కూడా తరిమేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తమ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఆయనకు కనిపించడం లేదు.
పథకాలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తులు:
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అనేది గత మూడు దశాబ్దాలుగా వింటున్నదే. కొత్తగా ఇంకో 'పీ' ని చేర్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తెరదీశారు. అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు సాధికారత కల్పించడమే ఎజెండాగా ఉండాలే కానీ వారిని రాజకీయ పార్టీల వారీగా వర్గీకరించడం, కేవలం తన పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తానని, ఎవరిపైనా పక్షపాతం చూపించను అని రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడటం ద్వారా తన పదవికే మచ్చ తెచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్త పింఛన్ కోసం టీడీపీ నాయకుల ఇళ్లకు కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్‌లు, యానిమేటర్లు, డీలర్లను తొలగించేశారు. ఏడాదికి 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ నాయకులు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను వరుసపెట్టి పీకిపారేస్తున్నారు.

నాడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు:
వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ సీఎంగా సంక్షేమ పథకాల కోసం కేటాయించిన ప్రతి రూపాయి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా వెన్నుదన్నుగా నిలిచారు. పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ (పీఐపీ), పావర్టీ రూరల్ అప్రైజల్ (పీఆర్ఏ)ల ద్వారా పేదరికంలో ఉన్న నిజమైన లబ్దిదారులను గుర్తించి సామాజిక అసమానతలు లేకుండా చేశారు. కులాలు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు.