
- టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఈ చట్టాన్ని ఆమోదించాయి
- టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పాసయ్యేదా?
- వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?
- వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది
- టీడీపీ, జనసేనలకు ఆ దమ్ముందా?
- వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.
లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..
వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.
మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?
చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం.

2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు.