వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

Published Fri, Feb 9 2024 3:28 AM

YSRCP announces candidates for three Rajya Sabha seats - Sakshi

సాక్షి,అమరావతి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులను గురువారం ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్‌ అభినందించారు. గురువారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్‌ను కలిశారు. తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు వారు సీఎం  జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేనిది: మేడా రఘునాధరెడ్డి 
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రుణం తీర్చుకోలేనిది అని మేడా రాఘునాధరెడ్డి చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులు రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని రఘునాధరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ మరణాంతరం వైఎస్‌ జగనే తమకు పెద్ద దిక్కని నమ్ముకున్నామన్నారు.

సీఎం జగన్‌ తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. ఊపిరి ఉన్నంతవరకు సీఎం జగన్‌ ఏది ఆదేశిస్తే అదే చేస్తామని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ బాధ్యత అప్పగించినా విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. 

ఇది సీఎం జగన్‌ ఇచ్చిన గుర్తింపు: వైవీ సుబ్బారెడ్డి 
పారీ్టకి క్రమ శిక్షణతో పనిచేసిన తమకు ఇది సీఎం జగన్‌ ఇచ్చిన గుర్తింపు అని వైవీ సుబ్బారెడ్డి చెప్పా­రు. సీఎం జగన్‌ తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. 

నమ్మిన వారిని ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తారు :  గొల్ల బాబూరావు 
వైఎస్సార్‌ కుటుంబాన్ని నమ్మిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తారని గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్‌ తర్వాత వైఎస్‌ జగన్‌ను నమ్మానని, కష్ట కాలంలో ఆయన వెంట అడుగులో అడుగేసి నడిచానని చెప్పారు. ‘అన్న నేను ఉన్నాను.. నిన్ను చూసుకుంటాను’ అని అన్నారని, అలాగే ఉన్నత స్థానం కోసం అవకాశం కల్పించారని తెలిపారు. తుది శ్వాస వరకు సీఎం జగన్‌ వెంట నడుస్తానని, వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా పని చేస్తానని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement