
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్‌సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.
బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని
చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్‌ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.