కామ్రేడ్.. డామిట్‌ కథ అడ్డం తిరిగిందా?

Why Left Parties Took U Turn In MLC Elections For Graduates in AP - Sakshi

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొన్ని ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. లక్ష్యం ఒక్కటే. చీకటి ఒప్పందాలతో అయినా పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. తాము బలపరిచిన అభ్యర్థి గెలవకపోయినా ఫర్వాలేదు.. 

1. టీడీపీ గెలిస్తే చాలనుకున్న ఆ పార్టీలు ఏవి? 

2. పచ్చ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ నాయకులు ఎవరు? 

3. సొంత పార్టీని ఫణంగా పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించింది ఎవరు? ఎందుకిలా జరిగింది? 

4. నెల్లూరు జిల్లాలో ఆ రెండు పార్టీల మద్య కుదిరిన రహస్య ఒప్పందమేంటి..? సైద్దాంతిక నిబద్ధతను కామ్రేడులు గాలికి వదిలేశారా? 

5. భవిష్యత్ ఇస్తామని పచ్చ పార్టీ చూపిన ఆశలకు లొంగిపోయారా? 

6. చంద్రబాబు ప్రలోభాలకు సరెండర్‌ అయి వారి బలాన్ని టీడీపీకీ ట్రాన్స్‌ఫర్ చేశారా..? లేక డబ్బు కోసం చేతులు కలిపారా ? 

7. పట్టభద్రుల ఎన్నికలో టీడీపీ చేసిన జిమ్మిక్కులేంటి..? 

ఇప్పుడు ఇదే చర్చ ప్రస్తుతం వామపక్ష అభిమానుల్లో నడుస్తోంది.. గెలిచే బలమున్నప్పటికీ.. ఎందుకు టీడీపీ అభ్యర్దికి సహకరించారని అందరూ చర్చించుకుంటున్నారు. 

తమను తాకట్టు పెట్టుకుని బాబుకు జై కొట్టారా?
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పీడీఎఫ్ అభ్యర్దుల గెలుపు ఖాయమనే భావన ఉండేది. గత పదిహేను సంవత్సరాలుగా ఈ రెండు స్థానాల్లో వామపక్షాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్దులే గెలుస్తూ వచ్చారు. కానీ ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలోకి దిగడంతో పీడీఎఫ్ అభ్యర్దులకు ముచ్చెమటలు పట్టాయి. గెలుపు అంత ఈజీ కాదని అర్దమైంది.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది చంద్రశేఖర్ రెడ్డిని, పట్టభద్రుల అభ్యర్ది శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదిపింది. డిపాజిట్లు అయినా సంపాదించుకోవాలనుకుంటున్న టీడీపీ వారితో జతకట్టింది.. ఇరు వర్గాల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరింది. రెండుసార్లు గెలిచిన పట్టభద్రుల పీడీఎఫ్ అభ్యర్థులు ఓడి, టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. 

రాజకీయం ఎన్ని మలుపులు తిరిగింది?
కామ్రేడ్స్‌ సైద్దాంతిక విలువలను గాలికొదిలేశారనే విమర్శలు నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. గత పదిహేనేళ్ళ నుంచి ఇక్కడి స్థానాల్లో విజయం సాదిస్తున్న పీడీఎఫ్ అభ్యర్దులకు సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. కానీ వారు తమ బలాన్ని ఈసారి టీడీపీకి ట్రాన్స్‌ఫర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి మంత్రి పొంగురు నారాయణ అనుచరుడు పట్టాభి బరిలోకి దిగాడు. నారాయణ విద్యాసంస్థలతో కోట్లు ఖర్చుచేయగల సత్తా ఉన్నప్పటికీ.. పీడీఎఫ్ అభ్యర్థులను టీడీపీ టచ్ చెయ్యలేకపోయింది.. పట్టాభిని పీడీఎఫ్‌ అభ్యర్దులు కామెడీగా పక్కకి నెట్టేశారు. ఆ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచింది.. గత ఎన్నికల్లో నారాయణ విద్యాసంస్థలనే ఢీకొట్టిన వామపక్షాలు... ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం వెనుక కుల సమీకరణాలు బాగా పనిచేశాయనే టాక్ నడుస్తోంది. వామపక్ష పార్టీలను లీడ్ చేసేది కూడా చంద్రబాబునాయుడి సామాజికవర్గమే కావడంతో జగన్ ను ఎదుర్కొనేందుకు వారంతా ఒక్కటయ్యారనే చర్చ కమ్యూనిస్టు పార్టీల్లోనే జరుగుతోంది.

మన వాళ్లు కక్కుర్తి పడ్డారు
కమ్యూనిస్టులు తెరచాటు రాజకీయం చెయ్యడం వల్లనే టీడీపీ అభ్యర్ది శ్రీకాంత్ విజయం సాధ్యమైంది. అనామకుడుగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన శ్రీకాంత్ కు కామ్రేడ్స్‌ సాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయం వెనుక భవిష్యత్ లో ఏమైనా పదవులు రావొచ్చు.. లేదంటే భారీగా లబ్ది అయినా చేకూరి ఉండొచ్చని నెల్లూరులో గాసిప్స్ వినిపిస్తున్నాయి. పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తాము బలపరిచిన అభ్యర్థినే త్యాగం చేసిన కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార సరళిని వామపక్ష అభిమానులే చీదరించుకుంటున్నారు.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top