సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు.
మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది.
అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్‌కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు.
టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు.


