కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల‍్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.
రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.
తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులు
నందిగ్రామ్‌లో సువేందు అధికారి vs పబిత్ర కర్
బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్‌లో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.
ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.
బహరంపూర్‌లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రా
అధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.
ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీ
అగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.
ఖరగ్‌పూర్ సదర్‌లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్
దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్‌పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.
మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్లు బర్మన్
కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.
డోంకల్‌లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్
మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.
పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్
ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్.


