ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు

Vellampalli Srinivas comments on Molestation Attack Of TDP Leader On Girl - Sakshi

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 

మార్చురీ వద్ద బాలిక తండ్రి, తాతయ్యలకు పరామర్శ

గట్టిగా వ్యవహరిస్తాం : మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

టీడీపీలో ఇలాంటి కామాంధులే ఎక్కువగా ఉన్నారు

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటన అత్యంత దురదృష్టకరమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ నేత వినోద్‌జైన్‌ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మతో కలిసి  పరామర్శించారు. బాలిక తండ్రి గంగాధర్‌కుమార్, తాతయ్య మాంచాలరావులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాలిక ఎంతో మనోవేదనకు గురైందని, టీడీపీ నేత వినోద్‌ జైన్‌ తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేసినట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొందని తెలిపారు.

మూడు పేజీల లేఖ రాసిందంటే ఆమె ఎంతగా మానసిక వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చన్నారు. బాలిక తాతయ్య రిటైర్డ్‌ తహసీల్దారు అని, పిల్లల కోసం ఏలూరు నుంచి విజయవాడ వచ్చినట్లు తెలిపారన్నారు. 50 ఏళ్లకు పైగా వయసున్న వినోద్‌ జైన్‌ దారుణంగా ప్రవర్తించాడని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వినోద్‌జైన్‌ ఎంపీ కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్‌ తరఫున చంద్రబాబు కూడా గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రుల బాధ చూడలేక పోతున్నామని, దోషిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. చంద్రబాబు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్‌ వద్ద, మెట్ల వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు దుర్గమ్మ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. 
చిత్రంలో దీక్షిత గౌరి తల్లిదండ్రులు  

అతన్ని ఉరి తీసినా తప్పు లేదు 
బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్‌ నోట్‌లో రాసిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు పురిగొల్పిన వినోద్‌జైన్‌ను ఉరితీసినా తప్పులేదన్నారు. వినోద్‌జైన్‌ దుర్బుద్ధి కారణంగా ప్రతిభావంతురాలైన బాలిక బలైందన్నారు. కుటుంబానికి చెప్పుకోలేని స్థితిలో ఆ బాలిక భయపడి మేడ మీద నుంచి దూకిందంటే ఏ మేరకు వేధించాడో అర్థమవుతోందన్నారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. బాలిక లేఖ చూసే వరకూ వాస్తవం బయటకు రాలేదని, రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడన్నారు. టీడీపీలో వినోద్‌జైన్‌ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు అహరహం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేసే టీడీపీ వాళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని ఆమె ప్రశ్నించారు.

మానసిక సంఘర్షణకు నిదర్శనం!
బాలిక చనిపోక ముందు తీవ్ర మానసిక వేదనకు గురైందని తెలుస్తోంది. సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వినోద్‌ జైన్‌ ఇంటిని విచారణ నిమిత్తం సీజ్‌ చేశారు. బాలిక సూసైడ్‌ చేసుకునే ముందు సుమారు 20 నిమిషాల పాటు టెర్రస్‌పై అటూ ఇటూ తిరిగినట్లుగా సీసీ కెమెరాలో కనిపించింది. తద్వారా ఆ బాలిక ఎంతో సంఘర్షణకు లోనైనట్లు అర్థమవుతోంది. జైన్‌పై భవానీపురం పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ 306, 354(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం  దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, స్థానిక కార్పొరేటర్‌ రెహమతున్నీసా బాలిక ఇంటికి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు. బాలిక తల్లిని ఓదార్చారు.  

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తాత
లైంగిక వేధింపులతో దీక్షిత గౌరి (14) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బాలిక తాత, విశ్రాంత తహసీల్దార్‌ గోవాడ మాంచాలరావు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రెండో కుమార్తె అనురాధ, అల్లుడు గంగాధర కుమార్, వారి పిల్లలు దీక్షిత గౌరి (14), నందశ్రీ విఘ్నేష్‌ (10) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని జీ 25 ఫ్లాట్‌కు ఎదురుగా మరో ఫ్లాట్‌లో ఈయన ఉంటున్నారు. అనురాధ వన్‌టౌన్‌ కొత్తపేటలోని అన్నపూర్ణ మున్సిపల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా, అల్లుడు గంగాధరకుమార్‌ ఎన్‌టీటీపీఎస్‌లో డీఈఈగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు మాంచాలరావు వాకింగ్‌ చేస్తుండగా ఎవరో ఒక పాప కిందకు దూకిందని అందరూ అనుకుంటుండగా ఆయనా వెళ్లి చూశారు. కిందకు దూకింది తన మనుమరాలు దీక్షిత గౌరి అని గుర్తించారు. ఆయనకు ఏం జరిగిందో అర్థంకాక కుమార్తె ఉంటున్న ఫ్లాట్‌లోకి వెళ్లి దీక్షిత గౌరి గదిలో చూడగా బెడ్‌పై నోట్‌ బుక్‌లో సూసైడ్‌ నోట్‌ కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్‌ నోట్‌ను వారికి అందజేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top