పవన్‌ అవసరం రాష్ట్రానికి, రైతులకీ లేదు

Thopudurthi Prakash Reddy Comments On Pawan Kalyan - Sakshi

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నాం 

వారికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం 

టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలప్పుడు పరామర్శకు రాలేదే? 

బాబుకు పవన్‌ దత్తపుత్రుడే 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవసరం ఇటు రాష్ట్రానికి కానీ, అటు రైతులకు కానీ లేనేలేదని అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి పవన్‌తో  చెప్పించుకోవాల్సిన అవసరంలేదని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంటున్నామని.. కాబట్టి అనంతపురం జిల్లాకు వచ్చి ప్రజలను మోసం చెయొద్దని పవన్‌కు ప్రకాష్‌రెడ్డి హితవు పలికారు. అలాగే, యువతనూ తప్పుదోవ పట్టించొద్దని, అభిమానుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని సూచించారు. చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడు అని స్పష్టంచేశారు. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని.. సీఎం వైఎస్‌ జగన్‌ వారికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. మూడేళ్లుగా వర్షాలూ సమృద్ధిగా కురుస్తున్నాయని.. రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని ప్రకాష్‌రెడ్డి చెప్పారు.  

పవన్‌ది రాజకీయ పర్యటన 
ఇక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.30 లక్షల దాకా సపోర్టు మనీ అంటూ, వచ్చిన పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల ప్రస్తావన లేదంటూనే రాజకీయాలు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ పవన్‌ పుట్టపర్తిలో ల్యాండ్‌ అయిన ప్రదేశానికి పక్కనే ఉన్న బుక్కపట్నం చెరువు నుంచి గ్రామసభ నిర్వహించిన మన్నీల వరకు ప్రతీ చెరువు నీటితో కళకళలాడుతోందన్నారు. అవేవీ పవన్‌కు కనిపించడంలేదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీలు కట్టలేక, పంటలకు గిట్టుబాటు ధరలేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఏ రోజూ పవన్‌ పరామర్శకు రాలేదని విమర్శించారు.

పైగా అప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. కానీ, సీఎం జగన్‌ ఆనాడు వేల మందితో రైతుభరోసా యాత్రచేస్తే ప్రభుత్వం దిగొచ్చి హడావిడిగా చెక్కులు పంపిణీ చేసిన విషయాన్ని తోపుదుర్తి గుర్తుచేశారు.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క అనంతపురంలోనే ఆత్మహత్య చేసుకున్న 84మంది రైతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పరిహారం అందించారని ప్రకాష్‌రెడ్డి చెప్పారు.

టీడీపీ హయాంలో మీరు రూ.5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడితే, ఆ పరిహారాన్ని రూ.7 లక్షలు చేస్తూ, సీఎం జగన్‌ చట్టం చేశారని తెలిపారు. రైతులకు బాబు, పవన్‌లు ఏమి ఒరగబెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాక.. గత ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసిందని, కానీ రైతులకు ఏం చేసిందని తోపుదుర్తి ప్రశ్నించారు. పైగా రైతుల ఉచిత విద్యుత్‌కు సంబంధించి, డిస్కమ్‌లకు రూ. 27వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టారన్నారు. కానీ, పవన్‌ ఇవాళ శ్రీరంగ నీతులు చెబుతున్నారని తెలిపారు.   

చంద్రబాబు బినామీ పవన్‌.. 
ఇక పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్న ప్రతీమాట టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టే అని ప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 21 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు గురించి పవన్‌ ఎనాడూ మాట్లాడరని.. బహిరంగంగా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన దాని గురించి మాట్లాడటానికి పవన్‌కు నోరు రాదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top