త్వరలో దేశంలో భారీ మార్పు

There Will Be Sensational News In 2 3 Months: KCR After Meeting Devegowda - Sakshi

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు  

జాతీయస్థాయిలో మార్పు తథ్యం 

దేశంలో అన్ని వనరులున్నా సాధించిందేమీ లేదు 

ఏ వర్గం కూడా సంతోషంగా లేదు 

బెంగళూరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ 

దేశానికి తృతీయ శక్తి ఆవశ్యకత ఉంది: కుమారస్వామి  

సాక్షి, బెంగళూరు/హైదరాబాద్‌: త్వరలో జాతీయస్థాయిలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు. రాబోయే మార్పును ఎవరూ ఆపలేరని, రానున్న రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారని పునరుద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన కేసీఆర్‌.. మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతోపాటు కర్ణాటక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేసీఆర్‌.. కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతోత్సవాలు జరుపుకుంటున్నామని, కానీ దేశంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

‘ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించారు. ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయి. అయినా పరిస్థితి మారలేదు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. భారత్‌ కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు 16 ట్రిలియన్‌ డాలర్లతో దూసుకుపోతోంటే.. మనం మాత్రం 5 ట్రిలియన్‌ డాలర్ల స్వప్నాల్లో మునిగిఉన్నాం’అని కేసీఆర్‌ అన్నారు. గొప్ప మానవ, నైసర్గిక వనరులున్న మన దేశంలో నిజంగా మనసుపెట్టి అభివృద్ధి చేస్తే అమెరికా కంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, వనరులను వినియోగించుకోవడంలో వెనకబడ్డామని అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఉజ్వల భారత్‌ కోసం శ్రమించాలి 
దేశంలో ప్రస్తుతం స్వతంత్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్నామని, అయినా భారత్‌ కరెంట్, మంచినీళ్లు, సాగు నీటి కోసం ఇంకా అల్లాడుతూనే ఉందని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌.. ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ప్రధానం కాదని, ఒక ఉజ్వల హిందుస్తాన్‌ కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దేశంలో ఎస్సీలు, ఆదివాసీలు ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారి పోతోందన్నారు.

దేవెగౌడ, కుమారస్వామిలతో జాతీయ, కర్ణాటక రాజకీయాలు చర్చించినట్లు చెప్పారు. గతంలో బెంగళూరు పర్యటనలో ఉన్నప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పానని, ఆ తర్వాత అది నిజమైందని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశంలో మార్పు రాబోతుందని, రానున్న రెండు, మూడు నెలల్లో ఒక సంచలన వార్త బహిర్గతం చేస్తానని చెప్పారు. 

ఉదయం 9 గంటలకు పయనం 
గురువారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంటనే ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి ఉన్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లారు.

స్వల్ప విశ్రాంతి అనంతరం దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం దేవెగౌడ కుటుంబసభ్యులతో భోజనం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుగుపయనమైన కేసీఆర్‌ 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  

కొత్త ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ ప్రయత్నం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ కొత్త ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ అనేకమంది నేతలతో భేటీ అవుతున్నారని, అందుకోసమే ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరమని, పేదల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్‌ కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ చెప్పినట్లు మరో మూడు నెలలు వేచిచూడాలని, మీరే మార్పులు చూస్తారని అన్నారు.

విజయదశమి నాటికి దేశంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. దేశ భవిష్యత్‌ దృష్ట్యా చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రణాళికలపై మూడు గంటలపాటు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయం అవసరమని, తృతీయ శక్తి ఆవశ్యకత ఉందన్నారు. గతంలో తృతీయ శక్తిపై తీసుకున్న నిర్ణయం వేరని, ఇప్పుడు వేరని స్పష్టంచేశారు. దేశ చరిత్రకు ఇది పునాది అని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top