
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లకు స్పెషలిస్ట్ కడియం శ్రీహరి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏఒక్కటి తన మార్క్ అని చెప్పడానికి లేని టాల్‌మాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఓర్వలేని తనంతో లెక్కచేయనితనంతో ఫ్రస్టేషన్‌కు లోనై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
బీజేపీలోకి రమ్మని పిలిచిన వెళ్లే జంపు జలానీలు తండ్రీ కూతుర్లని మండిపడ్డారు. అభివృద్ధి నినాదం అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 1560 కోట్లు, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తీసుకొస్తే, అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి 800 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.
ఓడిపోతాడనే భయంతో తక్కువ మెజారిటీతో మూడుసార్లు ఎమ్మెల్యే గెలవడం ప్రజా నాయకుడు అనిపించుకోడన్నారు. నియోజకవర్గంలో ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు, కుళ్ళు కుతంత్రాలు సాగవన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదని, నువ్వే అనుకుని ఆగమాగం అవుతూ.. ఈరోజు లింగాల ఘన్‌పూర్‌లో మా పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం శ్రీహరి దుర్బుద్ధికి నిదర్శనం అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.