ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం

Telangana: TPCC Political Affairs Committee Meeting - Sakshi

టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో నిర్ణయం 

టీఆర్‌ఎస్‌ అమలు చేయని హామీలపై పోరాటాలు 

కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత తొలిసారి సమావేశమైన రాష్ట్ర కాంగ్రెస్‌ అత్యున్నత కమిటీ 

గైర్హాజరైన కోమటిరెడ్డి బ్రదర్స్‌... కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్‌గా పనిచేసి ప్రజల్లో ఎండగట్టాలని, టీఆర్‌ఎస్‌ ప్రజలకు ఇచ్చి అమలు చేయలేని అన్ని అంశాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నిర్ణయించింది. నిరుద్యోగ అంశంతోపాటు ఇతర అన్ని ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకమైన తర్వాత శనివారం పీఏసీ తొలి సమావేశం గాంధీభవన్‌లో జరిగింది.

కమిటీ చైర్మన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ కన్వీనర్, మాజీమంత్రి షబ్బీర్‌ అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్,

ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, వంశీ చంద్‌రెడ్డిలు హాజరు కాగా, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ గైర్హాజరయ్యారు. మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు.  

గత రెండు నెలల కార్యక్రమాలు భేష్‌ 
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాసమస్యలు, భారత్‌బంద్, పోడు భూములపై పోరు తదితర అంశాలు పీఏసీలో చర్చకు వచ్చాయి. గత రెండు నెలలుగా జరుగుతున్న పార్టీ పోరాట కార్యాచరణ బాగుందని, అయితే దీన్ని మరింత ఉధృతం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీయాలని, అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలని నిర్ణయించారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అన్ని అంశాలను లేవనెత్తి పరిష్కారమయ్యే దిశలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా జరగబోయే ‘భారత్‌బంద్‌’ను ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి నడిపించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 5న పోడు భూముల హక్కుల సాధన కోసం ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన 400 కిలోమీటర్ల రాస్తారోకోలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని తీర్మానించారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. కాగా, సమావేశం అనంతరం రేవంత్, భట్టి, మధు యాష్కీగౌడ్, చిన్నారెడ్డి, మల్లురవి విలేకరులతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని తీర్మానించినట్టు వెల్లడించారు. పంజగుట్టలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున తామే ఏర్పాటు చేస్తామని తెలిపారు.   

పలువురు నేతలు.. పలు సూచనలు
సమావేశంలో నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల సమస్యల గురించి ప్రస్తావించారు. వారికి కొత్తరుణాలివ్వడంలోనూ, ఇచ్చిన రుణాలకు వడ్డీ చెల్లింపులోనూ, అభయహస్తం అమల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని, ఆ దిశలో కార్యాచరణ రూపొందించాలని నేతలు నిర్ణయించారు.

పంజగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, బీసీ గర్జన పేరుతో బహిరంగసభలు ఏర్పాటు చేయాలని వీహెచ్‌ సూచించారు. కాగా, సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డిలను కూడా పీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరిలు ప్రతిపాదించారు. కాగా, పీఏసీ కన్వీనర్‌గా మాజీమంత్రి షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలోనే బాధ్యతలు స్వీకరించారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో ఆయన పార్టీ నేతలకు విందు ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top