అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో భేటీ
ఈ నెల 4 నుంచి 9 వరకు జిల్లాల పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకోనున్నారు. గత నెల 19న మేడారంలో వనదేవతలను దర్శించుకొని స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన హాజరయ్యారు. 22న రాత్రి స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద నగరం జ్యూరిక్ నుంచి బయలుదేరి అమెరికా వెళ్లారు. 25న మసాచుసెట్స్ రాష్ట్రంలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సులో చేరారు.
30న కోర్సు పూర్తి చేసుకొని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టీఫికెట్ పొందారు. అనంతరం ఒకరోజు అమెరికాలో విశ్రాంతి తీసుకున్న రేవంత్.. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి హాజరుకానున్న ఆయన.. అదే రోజున వీలును బట్టి అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. తన విదేశీ పర్యటన వివరాలతోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల గురించి ఆయన ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది.
4 నుంచి జిల్లాలకు...
సీఎం రేవంత్ ఈ నెల 3 నుంచి 8 వరకు జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారవగా అందులో స్వల్ప మార్పులు జరిగినట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 3కు బదులు 4వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటనలు కొనసాగనున్నాయి. ఈ నెల 4న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ఈ నెల 9న మెదక్ జిల్లాకు వెళ్లనున్నప్పటికీ ఏ నియోజకవర్గానికి వెళ్లాలన్న షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేస్తారని (ఎన్నికల కోడ్ ప్రభావం లేని ప్రాంతాల్లో), జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా జరిగే సభల్లో పాల్గొంటారని, మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సమాచారం.


