ఇంత బరితెగింపు ఎక్కడా చూడలేదు 

Telangana: Minister Kishan Reddy Criticized CM KCR Family - Sakshi

అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతోంది

తండ్రీ కొడుకులు, మామ అల్లుళ్లపాలనకు త్వరలోనే చరమగీతం

ఏ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందో ప్రజలకు తెలుసు

మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబపాలన సాగుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, మామ అల్లుళ్లు, బావబామ్మర్దుల పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారన్నారు. అబద్ధాలు ప్రచారంచేసి, అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకునే రోజులు పోయాయని, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

శనివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాల్లో ఎన్నికలు చూశాం. కానీ హుజూరాబాద్‌ లాంటి ఉప ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంతగా బరితెగించింది ఎక్కడా లేదు. డబ్బు, మద్యం పంచడంతోపాటు ప్రజలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది’అని ఆయన ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ తమకు బద్దశత్రువని, అలాంటి పార్టీతో చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించడం సిగ్గుచేటన్న కిషన్‌రెడ్డి, ఏ పార్టీల మధ్య చీకటి ఒప్పందం, బహిరంగ ఒప్పందాలున్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, డబ్బులు, మద్యం ఏరులై పారించినా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు. శవాల దగ్గర పేలాలు ఏరుకునే స్వభావమున్న నేతలు పెట్రోల్‌ ధరలపై రాద్ధాంతం చేస్తున్నారని, లీటర్‌కు రూ.40 పైచిలుకు రాష్ట్రానికి ఆదాయం వస్తుండగా, సీఎం ఎందుకు తగ్గించడం లేదని ఎద్దేవా చేశారు.

హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితాలు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయని, భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్తారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్‌రెడ్డి చెప్పారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అరాచకాలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడుతోందని, రోడ్‌షోలో ఉన్న తనపైనే దాడికి యత్నించడం అమానుషమని కిషన్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, జిల్లా ఇన్‌చార్జి డాక్టర్‌ మురళీధర్‌గౌడ్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, సంకినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top