ప్రస్తుతం గులాబీ తోటలోనే..

Telangana: EX MP Ponguleti Srinivas Reddy Intersting Comments On TRS Ticket - Sakshi

ముళ్లు గుచ్చుకుంటున్నా బాధనిపించడం లేదు 

టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకున్నా పోటీ మాత్రం ఖాయం 

మాజీ ఎంపీ పొంగులేటి స్పష్టీకరణ 

తిరుమలాయపాలెం: ‘ప్రస్తుతం గులాబీ తోటలోనే ప్రయాణం చేస్తున్నా.. ముళ్లు గుచ్చుకుంటున్నా బాధ అనిపించడం లేదు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పు కోరతా..’అని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంతోపాటు పిండిప్రోలు, గోల్‌తండా, సుబ్లేడు, కాకరవాయి, రఘునాథపాలెంలోని పలు కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా సుబ్లేడులో మామిడి తోటలో శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకముందని చెప్పారు. ఒకవేళ తనను విస్మరించినా..ఎంపీ లేదా ఎమ్మెల్యేగా జిల్లాలోని ఏదో ఒక ప్రాం తం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల నుండి పోటీ విషయమై ఆదేశాలు రాలేదని చెప్పారు. తానేమీ బలప్రదర్శనలు చేయ డం లేదని, ప్రజలతో మమేకమవుతూ అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వాలు తనతో సంప్రదింపులు జరుపుతున్నాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top