
సాక్షి, విశాఖపట్నం/సీతంపేట(విశాఖ, ఉత్తర) : రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి రానుందని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఎండాడలో గల పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్రలో గల 34 నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రులు వలంటీర్లు అని, 57 నెలల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను మరోమారు ప్రజలకు గుర్తు చేసే హక్కు వారికి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు బెదిరింపులకు పాల్పడతున్న విషయాన్ని గుర్తు చేశారు. అసలు టీడీపీ, జనసేనలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు కుర్చీ మడత పెట్టడానికి వారికి కుర్చీనే లేదన్నారు. విధ్వంసం పుస్తకం రాసిన వాళ్లు, ఆవిష్కరించిన వాళ్లను చూస్తేనే దాని వెనుక ఉన్న విధ్వంసం అర్థమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఉన్నారు.
60 అడుగుల వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరణ
విశాఖ నగరం నడి బొడ్డున ఉత్తర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పార్టీ శ్రేణుల మధ్య శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. నగరంలోని అక్కయ్యపాలెం హైవే కూడలి వద్ద జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల వైఎస్సార్‌సీపీ జెండాను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తారని చెప్పారు. విశాఖ అభివృద్ధికి మా పార్టీ కట్టుబడి ఉందనడానికి నిదర్శనమే ఈ రోజు విశాఖనగరం నడి బొడ్డులో రాష్ట్రంలోనే అతి పెద్ద జెండా ఆవిష్కరణ జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీ‹Ù, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment