
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి.

రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.


కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్ ఘోరంగా అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా..