TDP Campaign: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట..

TDP Campaign For Atmakur Byelection Appeal To Not Vote For BJP - Sakshi

 పోటీకి దూరమంటూ ప్రచారం  ఓట్లు మాత్రం పక్క పార్టీలకు  వేయాలని నిర్ణయం

 ఓ వర్గం బీఎస్పీకి , మరో వర్గం ఇండిపెండెంట్‌కు  

 బీజేపీకి మాత్రం ఓటు వేయొద్దంటూ విజ్ఞప్తి

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొండాట ఆడుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం పోటీకి దూరమంటూ ప్రచారం చేసుకుంటూనే మరో వైపు ఓట్లు మాత్రం పక్క పార్టీలకు వేయించాలని రెండు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీని బలహీనపర్చాలని ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. 

సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీకి దూరమంటూనే ఓట్లు వేసేందుకు పోటీలో ఉన్న ఇతరులకు వేసేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో ఓ వర్గం మాత్రం బీఎస్సీ అభ్యర్థికి వేయాలని తీర్మానించుకోగా , మరో వర్గం మాత్రం ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటు విషయంలో కూడా వర్గరాజకీయాలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులే నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. 

ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 23న పోలింగ్‌ కావడంతో 21వ తేదీకే ప్రచార ఘట్టం ముగియనుంది. వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు, ఒక మున్సిపాల్టీ ఉండగా మండలానికో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్‌లుగా నియమించడంతో ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎన్నిక రోజున ఓటింగ్‌ శాతం పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మెజార్టీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించి ఆ దిశగా పనిచేస్తున్నారు.   

టీడీపీ ఓట్లు హోల్‌సేల్‌ 
ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల పరిస్థితి ఇరకాటంగా మారింది. ఆ పార్టీలో ఇప్పటికే వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థి పోటీ చేయలేదు. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీతో పాటు బీజేపీ, బీఎస్పీ, మరో పదకొండు మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం ఎవరికి ఓటు వేయాలని సందిగ్ధంలో ఉంటే.. ఆ పార్టీ ఓట్లను ఇతరులకు వేసేందుకు హోల్‌సేల్‌ బేరం మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీలో మూడు వర్గాలు నడుస్తున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి విషయంలో ఆ ముగ్గురు నేతలు తెరపైకి రావడంతో ఆధిష్టానం ఎటూ తేల్చలేక ఇన్‌చార్జి నియామకం నిలిపేసింది,

ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీలో ఓ వర్గ నేత మాత్రం బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయమని తన అనుచర వర్గానికి ఆదేశాలు ఇచ్చారు. మరో వర్గ నేత మాత్రం ప్రస్తుత ఎన్నికల బరిలో తన సొదరుడు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. టీడీపీ తరఫున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఉన్నాడు. అతనే ఈ ఉప ఎన్నికల్లో  ఇండిపెండెంట్‌గా బరిలో దిగడంతో ఆ పార్టీ కూడా అతన్ని సన్పెండ్‌ చేసింది. అయితే పార్టీ నుంచి బయటకు పంపినా ఆయన ఓ వర్గనేతకు  సొదరుడు కావడంతో లోలోన తన సోదరుడికి ఓట్లు వేయించాలని ప్రయత్నాలు మమ్మురం చేసినట్లు  ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.. దీంతో టీడీపీ శ్రేణులు పోలింగ్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు.    

బీజేపీ బలం పెరిగితే నష్టమని.. 
ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఓట్లు   బీజేపీకి పడితే ఆత్మకూరులో ఆ పార్టీకి ఓటు బలం పెరిగిందని వారు చెప్పుకొస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ ఓటింగ్‌ బలం చూపి పొత్తులో భాగంగా సీటు అడిగే ప్రమాదం ఉందని, బీజేపీకి రెండో స్థానం దక్కకుండా ఉండాలని బీఎస్సీకి ఓటు వేయండని ఆ నేత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు. అలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండాలంటే టీడీపీ ఓటింగ్‌ బీజేపీకి దూరండా ఉండాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన మాత్రం బీజేపీతో దోస్తితో ఉండడంతో వారు బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top