Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి కళ్లెదుటే ఎంపీ ఇళ్లు, కారు ధ్వంసం

Tamil Nadu DMK MP House Car Vandalised By Minister Nehru Supporters - Sakshi

తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్‌ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు.  

సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్‌ నేతగా కేఎన్‌ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్‌ మహేశ్‌ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు.  

నిరసనతో మొదలై..
తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు.

ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.  ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్‌ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం.

అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్‌లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్‌ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్‌ చేశారు.  

నెల్లైలోనూ వివాదం.. 
తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్‌ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్‌ మేయర్‌ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్‌ వకాబ్‌ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్‌ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్‌ వకాబ్‌ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్‌ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్‌ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు  వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు.

ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన 
పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్‌ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్‌లో లొంగి పోయారు. పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top