బీజేపీ బెస్ట్‌ అనిపిస్తా.. నమ్మకం నిలబెట్టుకుంటా: అన్నామలై

Tamil Nadu: Annamalai Takes Charge As BJP State President - Sakshi

రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అన్నామలై 

నీట్‌ ప్రయోజనాలపై ఇంటింటా ప్రచారం 

వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో వివక్ష లేదు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నలుగురు సభ్యులతో బీజేపీ అడుగుపెట్టింది, రాబో యే రోజుల్లో పార్టీని తదుపరి ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కే అన్నామలై అన్నారు. తనపై ఎంతో విశ్వాసంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్‌ అధికారి అయిన అన్నామలై తన పదవికి రాజీనామా చేసి గత ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

ఈ క్రమంలో... పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఎల్‌ మురుగన్‌కు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో అన్నామలై నియమితులయ్యారు. పార్టీలో చేరిన కొద్దినెలలకే రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందిన అన్నామలై కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్, బీజేపీ హైకమాండ్‌ తమిళనాడు ఇన్‌చార్జ్‌ సీటీ రవి, కో ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నేతలు హెచ్‌ రాజా, ఇలగణేశన్, బీజేపీ శాసనసభాపక్ష నేత నయనార్‌ నాగేంద్రన్, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. ‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థుల మేలుకోరే నీట్‌ ప్రవేశపరీక్షను కేంద్రం అమలు చేస్తోంది. లక్షలు, కోట్ల రూపాయలు చెల్లించి వైద్య విద్యలో చేరే పరిస్థితి నుంచి తప్పించి మేలు చేసేందుకే నీట్‌ ప్రవేశపరీక్ష. పేద, గ్రామీణ విద్యార్థులకు నీట్‌ ఒక వరప్రసాదం. ఈ సత్యాన్ని ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రచారం చేస్తుంది. కరోనా వ్యాక్సిన్‌ సరఫరాలో కేంద్రం సమభావం ప్రదర్శిస్తోంది. రాష్ట్రాలపై పక్షపాత వైఖరిని ప్రదర్శించడం లేదు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్‌ సరఫరా సాగుతోందేగానీ వివక్ష లేదు’’ అని అన్నారు. తమిళనాడుకు అదనంగా వ్యాక్సిన్‌ కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. 

పొంగులేటి పుస్తకావిష్కరణ: 
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడేళ్ల కాలంలో తమిళనాడుకు కేటాయించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన మేలుపై బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తమిళ, ఇంగ్లిషు భాషల్లో రూపొందించిన పుస్తకాన్ని అన్నామలై చేతుల మీదుగా ఆవిష్కరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top