లోక్‌సభ ఉప ఎన్నిక: పోటీకి సిద్ధమన్న శ్రద్ధ

Suresh Angadi Daughter Says Will Ready To Contest Belagavi LS By Poll - Sakshi

యశవంతపుర/కర్ణాటక: బీజేపీ అధిష్టానం‌ ఆదేశిస్తే తమ కుటుంబం బెళగావి లోక్‌సభ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుందని దివంగత కేంద్రమంత్రి సురేశ్‌ అంగడి కూతురు, మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ కోడలు శ్రద్ధా శెట్టర్‌ తెలిపారు. బెళగావి విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బెళగావిలో పోటీకి మానసికంగా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. అయితే, పోటీపై బీజేపీ హైకమాండ్‌ నిర్ణయమే అంతిమం అని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందన్నారు. కాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి(65) గతేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం విదితమే.

మహమ్మారి కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఆయన ప్రాతినిథ్యం వహించారు. సురేష్‌ అంగడి స్వస్థలం బెళగావి జిల్లాలోని కేకే కొప్పా. సురేశ్‌ భార్య పేరు మంగల్‌. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శ్రద్ధ ఉన్నారు. ఇక సురేష్‌ అంగడి మరణంతో బెళగావి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, ఆ స్థానంలో ఆయన కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఈమేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


కూతురు స్ఫూర్తితో సురేష్‌ అంగడి(ఫైల్‌ ఫొటో)

చదవండి: రాజకీయాలకు రాంరాం: దీప

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top