పుష్కరాల వేళ కూల్చేసిన ఆలయాలన్నీ తిరిగి నిర్మించాలి 

Somu Veerraju Comments On temples demolished during the Pushkaralu - Sakshi

బీజేపీ నేత సోము వీర్రాజు 

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్‌ : పుష్కరాల సమయంలో కూల్చి వేసిన ఆలయాలన్నింటినీ తిరిగి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఇంద్రకీలాద్రి నుంచి ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం  కృష్ణానది తీరంలో కూల్చివేసిన ఆలయ ప్రాంతాలను, ప్రభుత్వం ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు ఆలయాలను వారు పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆలయాలు నేలమట్టమై, అంతర్వేది రథం దగ్ధమై, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమై చాలా కాలమైందన్నారు. అయినా ఈ ఘటనలకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత పోస్ట్‌లు ఒక వర్గానికే దక్కాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ మర్చిపోయారని, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయలేదని విమర్శించారు. తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని త్రికోటేశ్వరస్వామిని కోరుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top