కేంద్రం విచారణకు ఆదేశించాలి: రేవంత్‌ | Revanth Reddy demands inquiry into Medigadda barrage | Sakshi
Sakshi News home page

కేంద్రం విచారణకు ఆదేశించాలి: రేవంత్‌

Oct 23 2023 4:42 AM | Updated on Oct 23 2023 4:42 AM

Revanth Reddy demands inquiry into Medigadda barrage - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ ప్రమాదానికి సీఎం కేసీఆర్‌ కుటుంబమే కారణమని.. కేసీఆర్‌ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని వ్యాఖ్యానించారు. గతంలో పంపుహౌజ్‌లు మునిగితే వర్షాలను సాకుగా చూపారని.. మరిప్పుడు వంతెన ఎందుకు కుంగిపోయిందో కేసీఆర్‌ చెప్పాలన్నారు.

ఆదివారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై సరైన సమ­యంలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రధాని మో­దీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి.. ఇప్ప­టికైనా విచారణకు ఆదేశిస్తారా? అని ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర విజిలెన్స్‌తో విచారణ చేయించి, సిట్టింగ్‌ జడ్జి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు ప్రమా­దమేంటి? లోపమేమిటన్న దానిపై చర్చించేందుకు తాను, సీఎల్పీ నేత భట్టి వస్తామని.. బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావు, కేటీఆర్‌ రావాలని సవాల్‌ చేశారు.

ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రమాదంపై గవర్నర్, ఈసీ స్పందించి విచారణకు ఆదేశించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అద్భుతమని కేసీఆర్, కేటీఆర్‌ చెప్తుంటారని, ఇప్పుడేం చెప్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రానికి కాళేశ్వరం గుదిబండగా మారబోతోందన్నారు. ప్రాజెక్టుకు స్వయంగా ప్లాన్లు్ల గీశానని కేసీఆర్‌ చెప్పారని.. భారీగా ప్రజాధనాన్ని గోదారి పాలు చేశారని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement