చక్కెర పరిశ్రమలు తెరిపించకుంటే గద్దెదిగాలి 

Revanth Reddy Comments on Kcr - Sakshi

సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి 

ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ ఎదుట చెరకు రైతులతో సమ్మేళనం

మల్లాపూర్‌(కోరుట్ల): నిజాం చక్కెర పరిశ్రమలను తెరిపించడం చేతకాకపోతే సీఎం కేసీఆర్‌ గద్దెదిగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో రైతులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. హరియాణాలో కంటే జగిత్యాల జిల్లా రైతులు లాభసాటి పంటలు పండిస్తారని చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఎదుట శనివారం చెరకు రైతులతో నిర్వహించిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో చెరకు పరిశ్రమలను ప్రభుత్వపరం చేస్తానని చెప్పిన కేసీఆర్‌.. ఆ తర్వాత వాటిని మూసివేయించారని మండిపడ్డారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు ముగిసిన అధ్యాయమని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించి మోసం చేశారని దుయ్యబట్టారు. ‘రైతుల సాక్షిగా చెబుతున్నా, కేసీఆర్‌.. తెలంగాణలో కూడా నీ అధికారం ఇక ముగిసిన అధ్యాయమే’అని రేవంత్‌ అన్నారు. రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రూ.300 కోట్లతో చక్కెర ఫ్యాక్టరీలు నడిపించలేరా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌పై కోపంతో బీజేపీ మాయలో పడొద్దని రైతులు, ప్రజలకు సూచించారు. మోదీ మెడలు వంచిన హరియాణా రైతుల స్ఫూర్తితో ఏకతాటిపైకి వచ్చి రైతు ఉద్యమాలు కొనసాగిస్తే చెరకు పరిశ్రమ పునరుద్ధరణ, పసుపుబోర్డు ఏర్పాటు సాధించుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌ మోడల్‌ అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నదీమ్‌ జావెద్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, జువ్వాడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top