‘డర్టీ డజన్‌ ఎమ్మెల్యేలు, దొరగాని దొడ్లో పశువులుగా మారారు.. రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Comments 12 MLA Who Jumps To BRS Mogullapally - Sakshi

సాక్షి భూపాలపల్లి/మొగుళ్లపల్లి: ‘మేం గెలిపిస్తే.. మా గుండెల మీద తన్ని, ఆస్తుల సంపాదన కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన డర్టీ డజన్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగాని దొడ్లో పశువులుగా మారారు’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌నుద్దేశించి ’’నక్సలైట్‌ ఎజెండా అంటివి ఏమైంది? మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా..’అంటూ ఘాటు విమర్శలు చేశారు.

రేవంత్‌ చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. రాత్రి మొగుళపల్లి మండల కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు ధరణితో దందాలు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లభించక, కనిపెంచిన తల్లిదండ్రుల బాధలు చూడలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ ఒక్క ఇల్లూ ఇవ్వలేదు.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, ముదనష్టపోడు కేసీఆర్‌ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. పసి పిల్లాడిని కుక్కలు పీక్కొని తింటే పట్టించుకోని దుర్మార్గ ప్రభుత్వం ఇదని రేవంత్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌కు రెండుసార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్‌ సిలిండర్, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  

గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దే  
స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్‌దేనని అన్నారు. ఆయనను ఎమ్మెల్యేను, చీఫ్‌విప్‌ను చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. ఈ విషయాలపై మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top