బీజేపీ కూటమి గెలుపు: రంగన్నకే పుదుచ్చేరి

Rangaswamy May Form Government In Puducherry - Sakshi

పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. ఈ కూటమి అధిక స్థానాల్లో విజయ కేతనం ఎగుర వేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుదుచ్చేరిలో పాగా వేయడం లక్ష్యంగా బీజేపీ ఆది నుంచి వ్యూహాల్ని పదును పెడుతూనే వచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేసి బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ల వైపుగా వెళ్లడంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. 

తేలని నేతృత్వం.. 
పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా ప్రకటించుకున్నా, నేతృత్వంపై మాత్రం  సందిగ్ధం నెలకొంది. అయితే, రంగస్వామి నేతృత్వంలోనే కూటమి అని, ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రకటించుకుంది. అయితే, బీజేపీ వర్గాలు ఈ విషయంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల అనంతరం నేతృత్వం గురించి చర్చించుకుందామని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకుందామని బీజేపీ నేతలు పేర్కొంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి రంగన్నకు చిక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌ తొమ్మిది చోట్ల విజయ ఢంకా మోగించింది. ఓ చోట ఫలితం తేలాల్సి ఉంది. ఇక, బీజేపీ మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. ఈ సారి ఇక్కడ అన్నాడీఎంకే ఖాతా తెరవలేదు. ఆపార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం ఇదే ప్రపథమం కావడం గమనార్హం. ఇక, ఇతరులు ఆరుగురు విజయకేతనం ఎగుర వేసి ఉండడం రంగస్వామికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, డీఎంకే – కాంగ్రెస్‌ కూటమికి ఆశించిన గెలుపు దక్కలేదు. అయితే, డీఎంకే మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ రెండు చోట్ల గెలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా ఎమ్మెల్యేల్ని రంగస్వామి దక్కించుకున్న దృష్ట్యా, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా..? లేదా కేంద్ర పెద్దలు ఏదేని మెలిక పెట్టేనా..? అన్నది వేచి చూడాల్సిందే.

చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top