తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు

BJP Won Four Seats In Tamil Assembly Elections - Sakshi

సాక్షి, చెన్నై: అసెంబ్లీలో కాలుమోపాలని ఎన్నాళ్లుగానో కలలుగంటున్న కమలనాథులు తమ కలను సాకారం చేసుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత తమిళనాడు శాసనసభలో బీజేపీ ఖాతా తెరిచింది. ఉత్తరాదిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీజేపీ దక్షిణాదిపై దృష్టి సారించింది. ‘అమ్మ’ను కోల్పోయి అనాథగా మారిన అన్నాడీఎంకేను చేరదీయడం ద్వారా తమిళనాడులో బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే మెలిగారు.

నాలుగేళ్లపాటూ ఎడపాడి ప్రభుత్వాన్ని కాపుగాసిన కమలనాథులు అన్నాడీఎంకే కూటమిలో కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు కోరారు. తీవ్రస్థాయిలో తర్జన భర్జనల తరువాత 20 సీట్లకు అంగీకారం కుదిరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా.. కనీసం ఒక్కసీటైనా గెలిచి తీరుతాం, అసెంబ్లీలో అడుగుపెడతామని బీజేపీ నేతలంతా సవాల్‌ విసిరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. మురుగన్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సినీనటి కుష్బు, అగ్రనేత హెచ్‌. రాజా తదితర హేమా హేమీలను పోటీపెట్టారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ఇతర కేంద్రమంత్రులు ప్రచారం చేశారు.

తెలుగువారైన పార్టీ కోర్‌కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి అభ్యర్థుల వెంట సుడిగాలిలా తిరిగి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పెద్దసంఖ్యలో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఈ రెండింటిలో ఒకటి పూర్తిగా నెరవేరకున్నా, అసెంబ్లీలో బీజేపీ ప్రవేశాన్ని మాత్రం ఖరారు చేసుకున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపు డు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని బీజేపీ రెండుసీట్లు గెలుచుకుంది. ఇన్నాళ్లకు మళ్లీ అదే అన్నాడీఎంకే కూటమి నుంచి బరిలోకి దిగి నాలుగు సీట్లను సొంతం చేసుకుంది. 

కమలనాథుల జేబులో కీలకసీటు.. 
పోటీచేసిన మొత్తం 20 స్థానాల్లో నాలుగింటిలో మాత్రమే గెలుపొందగా, వీటిల్లో కీలకస్థానమైన కోయంబత్తూరు దక్షిణంను సొంతం చేసుకోవడం విశేషం. బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్‌పై గెలుపొందడం విశేషం.  

అనుకున్న లక్ష్యం సాధించాం: పొంగులేటి 
నాలుగుసీట్లను గెలుచుకోవడం ద్వారా తమిళనాడు అసెంబ్లీలో కాలుమోపాలని పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించామని బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

చదవండి: 156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top