రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో ముసలం.. ఎవరి పంతం నెగ్గేను?

Rahul Gandhi Rajasthan Visit Factionalism Revealed Congress Party - Sakshi

సచిన్‌ పైలట్‌ని పక్కనపెట్టేందుకు రాహుల్‌ పర్యటనను వాడుకున్న గహ్లోత్‌ వర్గం

గహ్లోత్‌కి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమౌతున్న పైలట్‌ వర్గీయులు 

రాహుల్‌ రాజస్తాన్‌ పర్యటనలో బయటపడ్డ పార్టీ లుకలుకలు

సాక్షి , న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ రాజస్తాన్‌ పర్యటన రాష్ట్ర రాజకీయాలను మరోసారి హీటెక్కించింది. సీఎం అశోక్‌ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య ఉన్న దూరం రాహుల్‌ గాంధీ రాజస్తాన్‌ పర్యటనతో మరింత పెరిగింది. దీంతో రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. రెండు రోజుల పాటు రెండు జిల్లాల్లో జరిగిన నాలుగు సమావేశాలలో గహ్లోత్, సచిన్‌ పైలట్‌లు ఇద్దరూ కలిసి కనిపించినప్పటికీ, వారి మధ్య ఉన్న దూరం బహిరంగ వేదికపై బహిర్గతం అయ్యింది. ఈసారి రాహుల్‌ గాంధీ రెండు రోజుల పర్యటన మొత్తం గహ్లోత్‌ కనుసన్నల్లోనే జరిగింది. దీంతో సచిన్‌ పైలట్‌ను రాహుల్‌ గాంధీకి దూరంగా ఉంచేందుకు సీఎం వర్గం తన వంతు ప్రయత్నం చేశారు. రాహుల్‌ పర్యటనలో జరిగిన నాలుగు సమావేశాల్లో రెండింటిలో, పైలట్‌కు మాట్లాడేందుకు సైతం అవకాశం ఇవ్వలేదంటే పైలట్‌ విషయంలో గహ్లోత్‌ వర్గం ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

నినాదాలు.. గందరగోళాలు.. 
మరోవైపు గతంలో సచిన్‌ పైలట్‌ ప్రాతినిధ్యం వహించిన రూపన్‌గఢ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరిగిన సమావేశం పెద్ద ఎత్తున దుమారానికే తెరలేపింది. రాహుల్‌గాంధీ వేదికపైకి వచ్చిన వెంటనే రాహుల్‌ సహా మరో ముగ్గురు నేతలు మాత్రమే వేదికపై ఉండాలని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి అజయ్‌ మాకెన్‌ ప్రకటించారు. దీంతో వేదికపై నుంచి సచిన్‌ పైలట్‌ సహా ఇతర నేతలందరినీ కిందికి దింపేయడంతో, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి, సభలో గందరగోళం సృష్టించారు. అయితే నినాదాలు చేస్తున్న వారిని శాంతింపచేసేందుకు అజయ్‌ మాకెన్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ సహా ఇతరమంత్రులు మైదానంలో హడావిడిగా తిరిగినప్పటికీ, వారె వరూ ఏమాత్రం నినాదాలు ఆపలేదు.

అంతేగాక రాహుల్‌గాంధీ మాట్లాడేటప్పుడు పీసీసీ అధ్యక్షుడు దోస్తారా పైలట్‌ మద్దతుదారులను శాంతించాలని కోరడం, ఆ తర్వాత తన ప్రసంగంలోనూ రాహుల్‌గాంధీ ప్రజలు నినాదాలు చేయడం ఆపాలని చేసిన విజ్ఞప్తిని ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు సభ ముగిసిన తర్వాత రాహుల్‌గాంధీ, సీఎం అశోక్‌ గహ్లోత్‌లు ఇద్దరూ ఒకే వాహనంలో బయలుదేరే సమయంలోనూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పైలట్‌ మద్దతుదారులను రాహుల్‌గాంధీ కాన్వాయ్‌వైపు వెళ్ళకుండా ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అయితే రూపన్‌గఢ్‌లో జరిగిన సభ తర్వాత రాహుల్‌గాంధీ నాగౌర్‌ జిల్లా సభకు వెళ్ళే కాన్వాయ్‌లో సచిన్‌ పైలట్‌ కారును చేర్చేందుకు అనుమతి లభించకపోవడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.  

బలం చూపేందుకు.. 
రాజస్తాన్‌లో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన పార్టీకి లాభం చేకూర్చడం సంగతి పక్కనబెడితే, పార్టీలోని ఇద్దరు నాయకుల మధ్య ఉన్న దూరం మరింత పెరగడానికి కారణమైంది. ఇద్దరి మద్దతుదారులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చూపించుకొనే ప్రయత్నాలు పెద్దఎత్తున చేస్తున్నారు. రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటనలో తనను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన సచిన్‌ పైలట్, ఇప్పుడు ఫిబ్రవరి 17 న జైపూర్‌ జిల్లాలోని కోట్ఖావదాలో జరగబోయే కిసాన్‌ మహాపంచాయత్‌లో బల నిరూపణ చేసుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సచిన్‌ పైలట్‌కు రెండు మహా పంచాయత్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. ఈ అంశంపై సీఎం గెహ్లాట్‌ వర్గం కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైçపు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని, సందర్భాన్ని బట్టి గహ్లోత్‌ వర్గాన్ని దెబ్బతీయాలని పైలట్‌ వర్గీయ ఎమ్మెల్యేలు ఉవ్విళూరుతున్నారు.

చదవండిసీఏఏను రద్దు చేస్తాం: రాహుల్‌ గాంధీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top