కర్నాటక ఎన్నికల వేళ రఘువీరా రీఎంట్రీ.. క్రియాశీల పాత్ర పోషిస్తారా?

Raghu Veera Reddy Political Re-entry To Congress Party - Sakshi

నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళ క్రితం వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సొంతూరులో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు హఠాత్తుగా రఘువీరా మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. ఒకనాటి ఈ కాంగ్రెస్ నేత సెకండ్ ఇన్నింగ్స్‌కు కారణం ఏంటి..?

మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి నాలుగేళ్ళుగా సైలెంట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన్ను ఓటమి పలుకరించింది. అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన రఘువీరా రాజకీయ జీవితంపై రాష్ట్ర విభజన ప్రభావం బాగా పనిచేసింది. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీ నాయకులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో రఘువీరా కూడా సైలెంట్‌గా రాజకీయాల నుంచి పక్కకు జరిగి సొంత గ్రామం అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. 

ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతున్నపుడు ఆయన వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో హఠాత్తుగా ఆయనకు రాజకీయాల మీద గాలి మళ్లింది. కాంగ్రెస్ హైకమాండ్ రఘువీరాను బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ నేపథ్యంలోనే తన స్వగ్రామం నీలకంఠాపురంలో కాంగ్రెస్ కార్యకర్తలతో రఘువీరా సమావేశం నిర్వహించారు. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. 

కర్నాటక ఎన్నికల్లో తాను చురుగ్గా పాల్గొనబోతున్నట్లు చెప్పిన రఘువీరా.. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఏపీ రాజకీయాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు. గతంలో మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా? లేదా అన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికైతే కర్నాటక ఎన్నికల ప్రచారం మీదే ఆయన దృష్టి సారించారు. అక్కడ ఫలితాలు బాగుంటే తిరిగి ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతారేమో చూడాలి. నాలుగేళ్ళుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న రఘువీరా ఇప్పుడు హఠాత్తుగా కర్నాటక ఎన్నికల రంగంలోకి దిగడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top