ఇంత అన్యాయమా తల్లీ! | Rachamallu Siva Prasad Reddy Slams Sharmila | Sakshi
Sakshi News home page

ఇంత అన్యాయమా తల్లీ!

Mar 20 2026 8:33 PM | Updated on Mar 21 2026 2:43 PM

Rachamallu Siva Prasad Reddy Slams Sharmila

శత్రువుకు పావులా పనిచేస్తున్న షర్మిల కోసం కన్న కొడుకుపై అభాండాలా?

విజయమ్మకు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్న 

విజయమ్మపై షర్మిల ఒత్తిడి సుస్పష్టం..

తాజా లేఖ ద్వారా తాను ఒకవైపే ఉంటానని విజయమ్మ మరోసారి స్పష్టంచేశారు  

ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న షేర్లు తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి మరీ బదిలీ చేయడం దుర్మార్గం

జగన్‌ బెయిల్‌ రద్దయ్యే అవకాశముందని తెలిసీ మోసపూరితంగా చేశారు 

వైఎస్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ను గెలిపించాలని మీరు కోరడం నిజం కాదా.. 

షర్మిల ప్రభావం మీపైన ఎంత ఉందో వీటిని బట్టి తెలియడం లేదూ? 

తండ్రికి సంబంధంలేని ఆస్తులను.. కొడుకు ఆస్తులను.. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత కూతురుకు పంచాలనడం సబబేనా? 

షర్మిలకు పంచాలన్నట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచిస్తారా?.. చంద్రబాబు తన అక్క చెల్లెళ్లకు ఆస్తులు పంచిస్తారా?

జగన్‌ కంపెనీలలో మీరెవరైనా పెట్టుబడులు పెట్టారా? అప్పులకు గ్యారెంటీ ఇచ్చారా? లాభనష్టాలలో పాలుపంచుకున్నారా? 

ఆస్తుల పంపకం జరగలేదని ఎలా అంటారు? షర్మిలకిచి్చనవి పండుగల బహుమతులా? 

2004, 2009 వైఎస్‌ అఫిడవిట్లు చూస్తే.. ఆస్తుల పంపకం గురించి అర్థం కావడం లేదా? 

పెళ్లైన 15 ఏళ్ల తర్వాత కూడా షర్మిలకు తన స్వార్జితం నుంచి రూ. 230 కోట్లిచ్చిన జగన్‌ 

చెల్లెలిపై ప్రేమాభిమానాలతో తన ఆస్తులలో వాటా ఇస్తూ ఎంఓయూ చేసిన అన్న.. 

కాంగ్రెస్‌లో చేరడం, చంద్రబాబుతో చేతులు కలపడం వల్లనే ఆ ఎంఓయూను రద్దు చేశారు

జగన్‌ తరఫునే న్యాయం ఉందని ఎన్‌సీఎల్‌టీ తీర్పును బట్టి అర్థం కావడంలేదా?  

అయినా అప్పీల్‌కు వెళ్లారు.. ఆ తీర్పు వచ్చే వరకు ఆగలేరా?.. ప్రజా సమస్యల నుంచి, చేసిన తప్పుల నుంచి డైవర్ట్‌ చేయడానికే షర్మిలను, సునీతను దింపుతున్న చంద్రబాబు 

బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి పట్టించుకోని చంద్రబాబు 

అక్క చెల్లెళ్లకు వీసమెత్తు సాయం చేయని బాబు.. తమ్ముడికీ ద్రోహం చేసిన చరిత్ర.. 

తోడల్లుడు దగ్గుబాటి రాసిన పుస్తకంలోనూ బాబు ద్రోహాలకు సాక్ష్యాలు..  

ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

విజయమ్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్‌ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్‌ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్‌ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. 

విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్‌ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్‌ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో  కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. 

జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్‌ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్‌ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. 

 

తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్‌ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్‌ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్‌పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు.  ఆయన ఇంకా ఏమన్నారంటే...

వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..
చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. 

రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల  గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ  అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. 

స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?
చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్‌ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ  హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది  అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. 

అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్‌ను మాత్రం టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.

అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?
మంగళవారం ఎన్‌సీఎల్టీలో కౌంటర్‌ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? 

మొన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?

జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్‌ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.

ఎన్‌సీఎల్‌టీ తీర్పు అర్థమేమిటి?
న్యాయాన్యాయాలు తేల్చమని జగన్‌  ఎన్‌సీఎల్‌టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్‌ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? 

మీరు ఒక సైడ్‌ తీసుకోవడం న్యాయమా?
చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా అటాక్‌ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా?  సరస్వతీ పవర్, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్‌ షేర్‌ సర్టిఫికెట్లు జగన్‌ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్‌ బెయిల్‌ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్‌తో షేర్‌ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? 

షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది.  చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్‌ బెయిల్‌ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్‌సైడ్‌ తీసుకున్నారనేగా తల్లీ. 

కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?
బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? 

అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..
విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్‌కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్‌ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు.

ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?
షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్‌ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్‌ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్‌ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. 

ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్‌ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్‌ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. 

మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్‌ భరించారు. సరస్వతి పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్‌ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?

ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?
2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్‌ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్‌ఆర్‌ఎస్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు,  22.5 మెగావాట్ల స్వస్తిక్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. 

విజయవాడ యువరాజ్‌ సినిమా «థియేటర్‌ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్‌ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్‌కు కూడా ఇచ్చారని చెప్పారు. 

మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే  పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్‌ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. 

షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్‌ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్‌ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్‌ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు.   2019 ఆగస్టులో జగన్‌ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. 

ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్‌ మెంట్‌ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్‌ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్‌ జగన్‌ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్‌ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున  తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.

ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?
వైఎస్సార్‌గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్‌కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్‌ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?

తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్‌గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్‌గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?

ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్‌ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్‌ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్‌ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. 
అవి జగన్‌ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్‌ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?

రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్‌ కమిషన్‌కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్‌ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?

ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? 

ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న కంపెనీ షేర్స్‌ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్‌ బెయిల్‌ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్‌ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్‌ దగ్గరే ఉన్న షేర్స్‌ సర్టిఫికెట్స్‌ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి మరీ షేర్స్‌ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?

మీరు అఫిడవిట్‌ ఇచ్చిన తర్వాత ఎన్‌సీఎల్‌టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్‌ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?

జగన్ ఓర్పుగా ఉన్నాడని.. శత్రువులతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు

అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్‌ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?

విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్‌సైడ్‌ తీసుకున్నారు. షర్మిల సైడ్‌ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్‌ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్‌ పార్టీ అయితే జగన్‌ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్‌గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.

టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్‌ తప్పులు, బీఆర్‌ నాయుడు తప్పులు, పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ విషయం నేపథ్యంలో టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్‌ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్‌ మీరు రిలీజ్‌ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్‌లోని వెబ్‌సైట్‌లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్‌ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement