Punjab Assembly Election 2022: సిద్దూపై సుఖ్‌బీర్‌ బావ పోటీ

Punjab Elections: SAD Pits Bikram Majithia Against Sidhu in Amritsar East - Sakshi

లంబి సీటు నుంచి ప్రకాశ్‌సింగ్‌ కూడా బరిలో.. 

అభ్యర్థులను ఖరారు చేసిన అకాళీదళ్‌

చండీగఢ్‌: పంజాబ్‌లో ఎన్నికల రంగం రసకందాయంలో పడుతోంది. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై శిరోమణి అకాళీదళ్‌ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడి తూర్పు అమృత్‌సర్‌ నియోజకవర్గంలో సిద్దూపై సీనియర్‌ నేత, తన బావ విక్రమ్‌సింగ్‌ మజీతియా పోటీ చేయనున్నట్టు అకాళీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ ప్రకటించారు. బుధవారం ఆయన అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడారు.

తూర్పు అమృత్‌సర్‌ నియోజకవర్గంలో మజీతియా రంగంలోకి దిగడంతో సిద్దూ తన డిపాజిట్‌ కోల్పోక తప్పదని వ్యాఖ్యానించారు. అలాగే పంజాబ్‌ మాజీ సీఎం, తన తండ్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ (94 ఏళ్లు) లంబి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అకాళీదళ్, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. పంజాబ్‌ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లు ఉండగా.. అకాళీదళ్‌ 97 చోట్ల, బీఎస్పీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. 

కోర్టు కేసుల మధ్య.. 
సిద్దూపై పోటీకి దిగుతున్న విక్రమ్‌సింగ్‌ మజీతియాపై గత నెలలోనే డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల కింద పంజాబ్‌–హరియాణా హైకోర్టు మజీతియాకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా మూడు రోజుల పాటు పోలీసులు అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించింది. ఈ కేసులో ఆయన ఎప్పుడైనా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దూపై పోటీకి దిగుతుండటం ఆసక్తిగా మారింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top