పంజాబ్‌లో మోదీ చరిష్మా పనిచేసేనా! | Sakshi
Sakshi News home page

Punjab Assembly Election 2022: పంజాబ్‌లో.. మోదీ చరిష్మా పనిచేసేనా!

Published Tue, Feb 8 2022 7:08 AM

Punjab Assembly Election 2022: PM Modi Charisma May Workout In Elections - Sakshi

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ తర్వాత రెండో అతిపెద్ద రాష్ట్రం పంజాబ్‌. శిరోమణి అకాలీదళ్‌ దూరం కావడంతో పక్కా లెక్కలు వేసి... మాజీ కాంగ్రెస్‌ సీఎం, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ అధినేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో జట్టుకట్టడం ద్వారా బీజేపీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది., మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌లకు దీటుగా వెళ్లేలా పావులు కదిపింది. కూటమిలో పెద్దన్న పాత్రను తీసుకొని.. ప్రధాని మోదీతో భారీ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభాలకు ప్లాన్‌ చేసింది.

ఈ ఏడాది జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనలో అనూహ్య భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. హుసేనీవాలాలోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడానికి ప్రధాని రోడ్డు మార్గాన వెళుతుండగా పైరియాణా వద్ద ఓ ఫ్లైవర్‌లో మోదీ కాన్వాయ్‌ను రైతులు అడ్డగించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ప్రధాని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు వాహనంలో ఉండిపోవాల్సి రావడంతో తీవ్ర దుమారమే రేగింది. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. ఫిరోజ్‌పూర్‌లో బీజేపీ సభకు జనం వందల్లోనే వచ్చారని, అందుకే ప్రధాని తన పంజాబ్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని వెళ్లిపోయారని కాంగ్రెస్‌ ఆరోపించింది. చివరకు కేసు రూపంలో బంతి సుప్రీంకోర్టులో పడింది. 

ఒక్కసారిగా తగ్గిన జోరు.. 
ఈ ఘటన తర్వాత రాజకీయంగా బీజేపీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఏడాదికి పైగా పోరాడిన రైతుల్లో అధికులు పంజాబీలే. ఈ చట్టాలను ఉపసంహరించినా వారికి బీజేపీ కోపం తగ్గలేదనే సంకేతం జనంలోకి వెళ్లింది. దానికి తోడు బీజేపీ వేసుకున్న అంచ నాలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు కమలనాథులు పసిగట్టారు. దానికి తోడు పదేళ్లు కాంగ్రెస్‌ సీఎంగా పంజాబ్‌ను పాలించిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, హస్తం పార్టీని ఆయన బాగా దెబ్బతీస్తారని బీజేపీ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి.

పంజాబ్‌లో ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. పేరున్న పెద్ద నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని కాంగ్రెస్‌ నుంచి ఎవరూ అమరీందర్‌ పంచన చేరలేదు. అకాలీదళ్‌ దాదాపు ఇరవై ఏళ్ల బంధాన్ని తెంచుకొని ఎన్డీయే నుంచి వెళ్లిపోయింది కాబట్టి.. పంజాబ్‌లో సొంతంగా ఎదగడానికి దీన్నో అవకాశం వాడుకోవాలని బీజేపీ భావించింది. మొత్తం 117 నియోజకవర్గాల్లోని దాదాపు 4,000 వేల సభలు, సూక్ష్యస్థాయి ర్యాలీలు నిర్వహించాలని పథకరచన చేసింది.

హిందు ఓట్లపై ఆశలు.. 
2011 జనాభా లెక్కల ప్రకారం.. పంజాబ్‌లో 60 శాతం సిక్కులుంటే... 38.49 శాతం మంది హిందువులు ఉన్నారు. అకాలీదళ్‌తో రెండు దశాబ్దాల పొత్తులో బీజేపీ అధికంగా పట్టణ ప్రాంతాల్లో, అదీ హిందువుల ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల నుంచే పోటీ చేసింది. దౌబా ప్రాంతంలోని పటాన్‌కోట్, జలంధర్, హోషియార్‌పూర్,, షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ జిల్లాల్లో (మొత్తం నాలుగు జిల్లాలు) హిందువులే మెజారిటీగా ఉన్నారు. అకాలీదళ్‌తో పొత్తులో చిన్న భాగస్వామిగా ఉన్న బీజేపీ ఎప్పుడో తప్పితే 20 స్థానాలకు మించి డిమాండ్‌ చేయలేదు. పంజాబ్‌లో ఏకంగా 94 నియోజకవర్గాల్లో (మొత్తం సీట్లు 117) బీజేపీ ఏనాడూ పోటీచేయలేదంటే పార్టీ వాస్తవ బలమెంతో అర్థం చేసుకోవచ్చు. అయితే బెంగాల్‌లాగా ఇప్పుడు దృష్టి సారిస్తే.. భవిష్యత్తులోనైనా బలపడవచ్చని కమలదళం ఆశించింది.

అందుకే తాము ఏకంగా 68 అసెంబ్లీ సీట్లు తీసుకొని.. కూటమిలోని ఇతర పక్షాలైన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌కు 34, శిరోమణి అకాలీదళ్‌ (సంయుక్త్‌)కు 15 స్థానాలు కేటాయించింది. హిందూ ఓటు బ్యాంకుకు సిక్కులు జత కూడితే బలపడొచ్చనే ముందస్తు ప్రణాళికతో గత ఏడాది నవంబరులోనే సిక్కుల కోసం మోదీ ప్రభుత్వం ఏమేమీ చేసిందో చెబుతూ వాటిని ప్రచారంలో పెట్టింది. గురుద్వారాలకు విదేశీ విరాళాలు అందుకునేందుకు వీలు కల్పించామని, గురుద్వారాల్లోని లంగర్లు (నిత్యాన్నదాన సత్రాలను) జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయించామని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేసింది. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు ఆఫ్గానిస్తాన్‌కు కైవసం చేసుకోవడంతో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంధ్‌ సాహిబ్‌ మూడు ప్రతులను ప్రత్యేక విమానంలో డిసెంబరు 10న భారత్‌కు తీసుకొచ్చి.. దానిని విస్తృతంగా ప్రచారం చేసుకుంది.

అలాగే ఆఫ్గాన్‌లో చిక్కుకుపోయిన సిక్కులను ప్రత్యేక శ్రద్ధ పెట్టి సురక్షితంగా విమానాల్లో భారత్‌కు తరలించింది. ఇవన్నీ తమ హిందూ ఓటు బ్యాంకుకు కొంతైనా సిక్కుల ఓట్లను జతచేయాలనే ప్రణాళికలో భాగంగా జరిగినవే. అయితే బలమైన జాట్‌ సిక్కు వర్గానికి చెందిన అమరీందర్‌ తుస్సుమనడం, ఇతర ప్రాంతాలకు, వర్గాలకూ విస్తరించాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో కమలనాథలు ఆశలు ప్రస్తుతానికి అడియాసలుగానే మిగిలేలా కనపడుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ పంజాబ్‌ పర్యటనకు వెళితే గనక.. ఆయన చరిష్మా ఏమేరకు పనిచేస్తుందనే దాన్ని బట్టి ఈ కొత్త కూటమికి వచ్చే సీట్లు ఆధారపడి ఉంటాయి. వ్యవసాయ చట్టాలపై గుర్రుగా ఉన్న పంజాబ్‌ రైతులు ఆగ్రహాన్ని చల్లార్చి... హిందూయేతరుల్లో కొన్ని ఓట్లు సాధించగలిగితే బీజేపీ గౌరవప్రదమైన స్థానంలో ఉంటుంది.

హంగ్‌ వస్తే... కీలకమయ్యే ఛాన్స్‌? 
ఆప్‌ విజయావకాశాలు మెరుగుపడటం, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుందనుకున్న కాంగ్రెస్‌లో కీలకనేతలు.. సీఎం చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఏకతాటి పైకి రావడం... లాంటి పరిణామాలు పంజాబ్‌లో బలపడాలన్న బీజేపీ ఆశలను మరింతగా దెబ్బతీశాయి. మోదీ చరిష్మా పనిచేసి 20 నుంచి 30 స్థానాలను గనక ఈ కొత్త కూటమి చేజిక్కించుకొని... హంగ్‌ అసెంబ్లీ వస్తే అప్పుడు బీజేపీయే పంజాబ్‌లో కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలుంటాయనుకోవచ్చు! అంతుకుమించి ఆశించడం మాత్రం దురాశే కావొచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement