
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.
పొన్నూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు.