Sakshi News home page

వచ్చే నెలలో తెలంగాణకు మళ్లీ మోదీ!.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన!

Published Sat, Apr 8 2023 9:35 AM

PM Modi Will Come Again To Telangana For Kazipet Wagon Factory - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మరోసారి రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాజీపేటలో రైల్వేశాఖ నిర్మించనున్న సరుకు రవాణా వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునీకరణకు శంకుస్థాపన, వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవం కోసం శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. వీటితోపాటు కాజీపేట ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ ప్రధాని మోదీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వీలు కల్పించేలా.. ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు తెలిసింది. 

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావటంతో.. 
గతంలో కేంద్రం కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తామన్నా దానిస్థానంలో వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపును మంజూరు చేసింది. దీంతో కేంద్రంపై రాజకీయ విమర్శలను ఎక్కుపెట్టడంతో.. వర్క్‌షాపు స్థానంలో వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అది ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారడంతో.. ఇతర కార్యక్రమాలతో కలిపి సింపుల్‌గా శంకుస్థాపన చేయటం సరికాదని కేంద్ర పెద్దలు ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే విడిగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

వచ్చే నెలలో శంకుస్థాపనకు ఛాన్స్‌.. 
కాజీపేటకు తొలుత మంజూరు చేసిన పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌ అంచనా వ్యయం రూ.269 కోట్లు. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ముగిసిన తర్వాత రైల్వేశాఖ.. ఈ వర్క్‌షాప్‌ ప్రతి పాదనను వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీగా మారుస్తూ, అంచనాను రూ.521 కోట్లుగా ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే భూమిని రైల్వేశాఖకు బదలాయించిన నేపథ్యంలో.. నిర్మాణ పనులకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ వచ్చే నెలలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి.. వ్యాగన్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.  

Advertisement

What’s your opinion

Advertisement