
చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని.. ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారాయన.
సాక్షి, తిరుపతి: చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. చంద్రబాబు, లోకేష్, పవన్ ఏవిధంగా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన నా తనయుడు మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయించింది. గతంలోనూ మిథున్‌రెడ్డిని ఇబ్బంది పెట్టింది చూశాం. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారు. అది తప్పుడు కేసుగా తేలింది.
మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని మరీ వేధిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ అన్నారు. ఆ కేసులో ఏమీ లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించారని వేధించారు. ఇప్పుడేమో ఏకంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసుగానే తేలుతుంది.
అసలు లిక్కర్ కేసులో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం తేల్చింది?. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?. కేవలం జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. మిథున్‌రెడ్డిపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే. మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు.
ఈ పర్యవసానం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయంలో ఒక మచ్చగా మిగులుతుంది. రాబోయే రోజుల్లో అపవాదులు, అపకీర్తి, దుర్మార్గాలతో ప్రజలకు చంద్రబాబు ఎలా జవాబు చెబుతారో చూడాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

వైఎస్సార్సీపీని ఇప్పటికిప్పుడు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు తరలి వచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళల్ని, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్షపార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారు. పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అరెస్ట్ చేయిస్తూ.. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారు, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు చంద్రబాబు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’’ అని రామచంద్రారెడ్డి హితవు పలికారు.