
సాక్షి, రాజమండ్రి: కూటమి పాలనతో ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ అయిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో తాలిబన్ల పాలన నడుస్తోంది. ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయింది. కూటమి సర్కార్ అప్రజాస్వామిక్యంగా వెళ్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి. అయినా మిథున్‌రెడ్డి కూటమి ప్రభుత్వ వేధింపులను దీటుగా ఎదుర్కొంటున్నారు.
అయితే న్యాయపరంగా అందాల్సిన చర్యలను కూడా కూటమి అడ్డుకోవాలని చూస్తోంది. ఈ అన్యాయాలపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం అని పెద్దిరెడ్డి అన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి కుట్రేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన డిస్టలరీలతోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు జరిపింది. మా పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కానీ, కూటమి పాలనలో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారు అని మండిపడ్డారాయన.
కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మిథున్‌రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆయనపై పెట్టింది అక్రమ కేసు. వైఎస్సార్‌సీపీకి ఆయనకు అండగా ఉంటుంది మాజీ హోం మంత్రి అనిత అన్నారు.

ప్రతిపక్షం నోరు నొక్కాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు భయపడి వెనక్కి తగ్గం అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.