ఓటమి భయంతోనే బాబు డ్రామా

Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu - Sakshi

సానుభూతి కోసమే నాటకాలు

మామ మీద చెప్పులు వేయించిన నీచ సంస్కృతి చంద్రబాబుదే

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి తుడా : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలకు దిగాడని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం రాత్రి మంత్రి పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  తిరుపతి పర్యటనలో రాళ్లు వేశారని, దానికి వైఎస్సార్‌సీపీ నేతలే కారణమని చంద్రబాబు నిందలు వేయడం సరైంది కాదన్నారు. మిద్దెపై నుంచి రాయి విసిరారని చెబుతున్న చంద్రబాబు.. అది ఎవరికి తగిలిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న నాటకాన్ని ప్రజలు ఎవరూ విశ్వసించబోరన్నారు. రాళ్ల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు  జోడించి విమర్శించడం చంద్రబాబుకు తగదన్నారు. సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 

నాడు అమిత్‌షాపై రాళ్లు వేయించిందెవరు?
టీడీపీని దక్కించుకునేందుకు నాడు మామ మీద చెప్పులు వేయించిన నీచ సంస్కృతి చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. అదే విధంగా అమిత్‌షా మీద రాళ్లు వేయించి లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి కూడా చంద్రబాబే అన్నారు. మీటింగ్‌ ముగింపు సమయంలో తనపై రాళ్ల దాడి జరిగిందని ఎస్పీ ఆఫీసు ముందు నిరసన చేయడం, ఆ వెంటనే టీడీపీ నాయకులు విమర్శలు గుప్పించడం, పచ్చ మీడియాలో వరుసపెట్టి ప్రసారాలు చేయడం పక్కా స్కెచ్‌ ప్రకారమే జరిగిందని చెప్పారు. పోలీసులు విచారణ జరిపి, ఈ నాటక సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణలో తమ పార్టీ వారి పాత్ర ఉందని తేలితే వారిని తామే పట్టిస్తామని చెప్పారు. చచ్చిన పామును కర్రలతో కొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. చంద్రబాబు వయసుకు తగ్గట్టు నడుచుకుంటే మంచిదని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top