సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. దీంతో పట్టాభిపురం సిఐకి, అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం జరిగింది.
అంబటి రాంబాబుపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దౌర్జన్యం చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు బుధవారం(నవంబర్ 12) భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను కంకరగుంట ఫ్లైఓవర్ మీదకు రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయతి్నంచిన నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, అంబటికి వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. పోలీసుల అవరోధాలను అధిగమించిన నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లారు. మంత్రి లోకేష్ ప్రోద్భలంతో సీఐ తనను టార్గెట్ చేశారని రాంబాబు మండిపడ్డారు.


