
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్‌గా ఉన్నాడు.
..వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్‌ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్‌పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్‌పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్‌ను చంపినట్టే వెంకట ప్రసాద్‌ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్‌ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు.