
సాక్షి, గుంటూరు: జిల్లా జైలు నుంచి వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాచర్ల మునిసిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిషోర్ శుక్రవారం విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్‌ను జైల్లో ఉంచిన కూటమి ప్రభుత్వం. ఆయనపై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్‌ను చంద్రబాబు సర్కార్ బనాయించింది.

ఆరేళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్‌పై కేసు నమోదు చేసి పీటీ వారింట్ ద్వారా అరెస్టు చూపించిన ప్రభుత్వం.. జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేసింది. కిషోర్‌పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంట చింతల పోలీసులు నమోదు చేసిన కేసులో కిషోర్‌ది అక్రమ అరెస్టు అని హైకోర్టు తేల్చి చెప్పింది.
తురకా కిషోర్‌పై కేసుల మీద కేసులు పెడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్ సీఆర్‌పీసీ, బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది.
కిషోర్ రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజి్రస్టేట్, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్ చేయలేదని పేర్కొంది. కిషోర్ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లా జైలు నుంచి ఇవాళ(శుక్రవారం) తురకా కిషోర్ విడుదలయ్యారు.
