కాంగ్రెస్ వల్లే 'ఇండియా' పురోగతి తగ్గింది: నితీష్ కుమార్

Nitish Kumar Criticise Congres About India Progress  - Sakshi

పాట్నా: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టిందని విమర్శించారు. అందుకే కూటమిలో దూకుడు తగ్గిందని చెప్పారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో పేరుతో పాట్నాలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  

ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడానికి అందరం అంగీకరించామని తెలిపిన నితీష్ కుమార్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే ఇండియా కూటమి మరో భేటీ జరిగేలా కనిపిస్తోందని వెల్లడించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ వల్లే దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే లోక్ సభ ఎన్నికలపై సన్నద్ధత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. 

కాగా.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొదటి సమావేశం బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. రెండో సమావేశం బెంగళూరు వేదికగా నిర్వహించారు. ఇక మూడోసారి ముంబయిలో ఆగష్టు 31న భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. సీట్ల షేరింగ్‌లో పార్టీల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. 

ప్రస్తుతం నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించింది. 

ఇదీ చదవండి: కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు

      

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top