
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నర్సీపట్నం: ‘పార్టీ అనుబంధ సంస్థలకు ఇన్‌చార్జిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంటి దగ్గరే కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని నా కుమారుడు దేవాన్ష్ అడుగుతున్నాడు. వాళ్ల తాతకు కూడా ఫిర్యాదు చేస్తున్నాడు’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కేసుల గురించి భయపడొద్దనీ.. తనపై కేసులున్నా భయపడటం లేదని అన్నారు.
తన జీవితంలో జైలు మినహా అన్నీ చూశాననీ, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పారు. వచ్చే రెండేళ్లు ప్రజల్లో తిరుగుతాననీ, ఇంటికి అంతగా రానని భార్య బ్రాహ్మణికి కూడా చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లోకేశ్ నర్సీపట్నం వచ్చి పోలీసులపై తీవ్రంగా విమర్శలు చేశారు. అయ్యన్నపాత్రుడిపై 9 కేసులు పెట్టి పోలీసులు ఏం పీకారని ప్రశ్నించారు. తనపై 11 కేసులు పెట్టి ఏం పీకారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టనన్నారు.