
సాక్షి, తాడేపల్లి: మనుషులను వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని.. అధికారంలో లేనప్పుడు మాత్రమే బీసీలు చంద్రబాబుకు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. ‘‘రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక్క పథకాన్ని కూడా బీసీలకు చంద్రబాబు అమలు చేయలేదు. బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు)
బీసీల సామాజిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. 57 బీసీ కార్పొరేషన్లు సీఎం జగన్ ఏర్పాటు చేశారని, 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే 2 సీట్లు బీసీలకు సీఎం జగన్ ఇచ్చారని తెలిపారు. రాజకీయంగా అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 5 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సీఎం జగన్ తన పరిపాలనలో భాగస్వామ్యం చేశారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఏనాడైనా బాబు రాజ్యసభ పదవి ఇచ్చారా? అని మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. (చదవండి: హర్షకుమార్‌కు సవాల్ విసిరిన నందిగం సురేష్)