సబ్‌ప్లాన్‌ అంటే లోకేష్‌కు తెలుసా?: మంత్రి మేరుగ నాగార్జున

Minister Merugu Nagarjuna Fires On Lokesh Over Sub Plan - Sakshi

సాక్షి, విజయవాడ: దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్‌కు లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సబ్‌ప్లాన్‌ అంటే లోకేష్‌కు అసలు తెలుసా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో జనం లేక లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. దళితులను మోసం చేసిన చరిత్ర.. దళితుల నిధులను పక్కదారి పట్టించిన ఘనత చంద్రబాబుదేననని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు సబ్ ప్లాన్‌ను నాశనం చేశాడని.. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సబ్‌ప్లాన్‌ను అమలు చేశారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ కింద నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన అందిస్తున్నామన్నారు.

‘దళితుల మీద దాడి చేస్తే నీపైన ఏంటి.. మీ నాన్న పైన కూడా కేసు పెడతాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పొలంబడి, రైతు క్షేత్రాలు, నేప్‌కీన్లు, పెళ్లి కానుక, ఎన్టీఆర్ సుజల స్రవంతికి ఖర్చు పెట్టామని చంద్రబాబు చూపించాడు. ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది మీ బాబు, నువ్వు కాదా?. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం పెడుతుంటే టీడీపీ ఓర్వలేకపోతోంది. గతంలో ఎస్సీలకు రుణాలు పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై  జరిగిన దాడులపై చర్చించడానికి నేను సిద్ధం’ అంటూ లోకేష్‌కు మంత్రి సవాల్‌ విసిరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top