మే 5న మమత ప్రమాణ స్వీకారం

Mamata Banerjee to take oath as West Bengal Chief Minister on May 5 - Sakshi

టీఎంసీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. మమతా బెనర్జీ మే 5వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతారని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నెల 6వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.అంతకుముందు జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే కోవిడ్‌ సంక్షోభంపై పోరాటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ నుంచి ఫోన్‌ కాల్‌ రాలేదన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో ప్రధానమంత్రి ఫోన్‌ చేయకపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే, ఆయన బిజీగా ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను పట్టించుకోను’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి.

ప్రాణభయంతోనే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ రీకౌంటింగ్‌ పెట్టలేదు
నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్‌ జరపాల్సిందేనని డిమాండ్‌లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్‌ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్‌ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్‌ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్‌ఎంఎస్‌ను మీడియాకు చూపించారు.

రిటర్నింగ్‌ అధికారి ఆ ఎస్‌ఎంఎస్‌ను చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్‌ డౌన్‌ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top