Congress President Mallikarjun Kharge Writes Back To Amit Shah Difference Between Words Action - Sakshi
Sakshi News home page

మీ మాటలకు చేతలకూ పొంతన లేదు: మోదీ, షాలపై విరుచుకుపడ్డ ఖర్గే

Published Wed, Jul 26 2023 7:41 PM

Mallikarjun Kharge writes back to Amit Shah Difference between words action - Sakshi

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంతో గత అయిదు రోజులుగా పార్లమెంట్‌ సమావేశాలు స్తంభిస్తున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, హింసపై చర్చించాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా పట్టుబడుతున్నాయి. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం చెబుతున్నా.. ప్రధానమంత్రి మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్షాలు మొండిగా ప్రవర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని సైతం ప్రవేశ పెట్టాయి. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ తమను బ్రిటీషర్లతో, ఉగ్రవాద సంస్థతో పోలిస్తే.. ఇటు అమిత్ షా ప్రతిపక్ష పార్టీల నుంచి సహకారం కోరుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చాలా కాలం నుంచి దూరం ఉందని, అయితే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా దూరం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు దశ, దిశ లేదని మోదీ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం మాట్లాడే మాటలకు, చర్యలకు పొంతన ఉండటం లేదని విమర్శించారు.
చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!

మణిపూర్‌ ఘటనపై చర్చించడంపై విపక్షాలకు అమిత్‌ షా రాసిన లేఖపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ..‘అమిత్‌షా లేఖకు, ప్రభుత్వ వైఖరికి పూర్తి విరూద్ధంగా ఉంది. అందులోని పదాలకు, మీ చేతలకు ఎంతో తేడా ఉంది. పార్లమెంట్‌లో ప్రభుత్వం వైఖరి ఏకపక్షంగా, నియంతృత్వంగా ఉంది. మీ నుంచి ఈ వైఖరి కొత్తమీ కాదు. గత కొన్ని సెషన్స్‌ నుంచి మీ వైఖరి ఈ విధంగానే కనిపిస్తోంది. మేము మణిపూర్‌ సమస్యపై మోదీ లోక్‌సభకు వచ్చి ప్రకటన చేయాలని కోరుతున్నాం. దీనిపై కూలంకషంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రజలపై మాకు నిబద్ధత ఉంది. అందుకు ఎంతకైనా తెగిస్తాం’ అని పేర్కొన్నారు.

కాగా మణిపూర్‌లో మే 3న రెండు వర్గాల వైరంతో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. 84 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై జరిగిన ఆకృత్యానికి సంబంధించిన వీడియో ఇటీవల వెలుగులోకి రావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. 
చదవండి: హృదయ విదారకం.. చికాగో రోడ్లపై దీనస్థితిలో హైదరాబాద్‌ మహిళ

Advertisement

తప్పక చదవండి

Advertisement