చంద్రబాబుదో అబద్ధాల ఫ్యాక్టరీ

Kurasala Kannababu Fires On Chandrababu - Sakshi

దేవాలయాల దాడుల వెనుక టీడీపీ ప్రమేయం 

సీఎం వైఎస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేకే కుట్రలు 

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం  

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన బృందం అబద్ధాల ఫ్యాక్టరీ పెట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. హిందూ విగ్రహాల కూల్చివేత ఘటనల వెనుక ఉంది టీడీపీ కార్యకర్తలేనని విమర్శించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూసి ఓర్వలేక బాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కన్నబాబు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు కులాన్నీ, అమరావతిని ఎంచుకుని అసత్యాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మతాన్ని భుజానికెత్తుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. మంత్రి కన్నబాబు ఇంకా ఏమన్నారంటే... 

► 12 ఏళ్ల కిందట సస్పెండ్‌ అయిన ఓ మెజిస్ట్రేట్‌ తమ్ముడిపై దాడి జరిగితే మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు సంబంధం ఉన్నట్టు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దాడి చేసింది టీడీపీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డి. 
► ఈ విషయమై డీజీపీ లేఖ రాస్తే దానికి సమాధానంగా చంద్రబాబు రాసిన లేఖలో డీజీపీపై వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం.  
► విశాఖ విమానాశ్రయంలో ఆనాడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేస్తే గంటన్నరలోపే నాటి డీజీపీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి టీడీపీ నాయకుడిగా ప్రవర్తించిన మాట నిజం కాదా? 
► తుని వద్ద రైలును తగులబెట్టించిందీ, ఆపైన గొడవ చేయించిందీ, అమరావతిలో అరటి తోటల్ని దగ్ధం చేయించిందీ చంద్రబాబే.  
► విజయవాడలో 40 గుళ్లను కూల్చి విగ్రహాలను చెత్తకుండీల్లో పడేసింది ఎవరో, సదావర్తి భూముల్ని పప్పుబెల్లాల్లా ఎవరెవరికి కట్టబెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 
► అంతర్వేది ఘటనపై ఎవరూ అడక్కముందే సీఎం సీబీఐ విచారణకు ఆదేశించారు. 
► రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు ఇచ్చేందుకు వైఎస్సార్‌ జలకళను ప్రారంభిస్తే చివరకు దానిపై కూడా అబద్ధాలు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, 108, అమ్మఒడిని కూడా చంద్రబాబే పెట్టారనేలా ఉన్నాడు.. యనమల. 
► రైతు భరోసా కేంద్రా (ఆర్‌బీకే)లు మున్ముందు ధాన్యంతోపాటు వేరుశనగ కొనుగోలు కేంద్రాలుగా మారబోతున్నాయి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top