కేవీ రావుపై పవన్‌ చేసిన ఆరోపణలు మరిచిపోయారా?: కురసాల కన్నబాబు | Kurasala Kannababu Comments On Chandrababu And Pawan Kalyan Conspiracies | Sakshi
Sakshi News home page

కేవీ రావుపై పవన్‌ చేసిన ఆరోపణలు మరిచిపోయారా?: కురసాల కన్నబాబు

Published Thu, Dec 5 2024 10:07 PM | Last Updated on Thu, Dec 5 2024 10:09 PM

Kurasala Kannababu Comments On Chandrababu And Pawan Kalyan Conspiracies

సాక్షి, కాకినాడ: పాలనలో తన వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన కాకినాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై ఈనాడు పత్రిక దిగజారిపోయి రోత రాతలు రాసిందని ధ్వజమెత్తారు.

కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక అసత్యాలు, అభూతకల్పనలతో వైఎస్‌ జగన్‌పైన బుదరచల్లేందుకు ప్రయత్నించాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు, వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని కన్నబాబు అన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..
2003లో తొండింగి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూములను ఎపిఐఐసికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలంలో ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు వ్యతిరేకించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో కాలుష్య కారక పరిశ్రమలను ఇక్కడకు రానివ్వను, రైతుల భూములను తిరిగి వారికి అప్పగిస్తానంటూ హామీలు గుప్పించారు. భూపోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా 2012లో ఏకంగా ఏరువాకలో సైతం పాల్గొన్నారు.

ప్రతిపక్ష నేతగా వ్యతిరేకించారు.. సీఎం కాగానే రైతులపై దాష్టీకం
2014లో అధికారంలోకి రాగానే గతంలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరిచిపోయారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. తమ భూములను దున్నుకునేందుకు వెళ్ళిన రైతులపై చంద్రబాబు పోలీసులను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేసి, రాజమండ్రి జైలుకు తరించారు. వారితో బాత్రూంలు కడిగించి, పలు రకాలుగా వేధించారు. కనీసం 2013 నాటి భూసేకరణ చట్టం కింద అయినా పరిహారం ఇవ్వాలన్న రైతుల కోరికను చంద్రబాబు నిరాకరించారు.

తొమ్మిది గ్రామాలను కబళించేందుకు తెగబడిన చంద్రబాబు సర్కార్ 
ఎస్ఇజెడ్ కు భూములను బలవంతంగా కట్టబెట్టేందుకు ఏకంగా తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించాలని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభల ద్వారా ఎస్ఇజెడ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారనే భయంతో ఆనాడు పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేష్ 73, 74 అధికారణ కింద పంచాయతీలకు ఉన్న హక్కులను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు వేరే వారికి భూములు అమ్ముకోకుండా ఉండేందుకు ఏకంగా వారి భూములను చంద్రబాబు ప్రభుత్వం నిషేద భూముల జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందింది.

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్న రైతులు
పాదయాత్రలో భాగంగా జగన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎస్ఇజెడ్ భూముల బాధిత రైతులు ఆయనను కలిశారు. ఆనాడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను. వారి బాధలను విన్న జగన్ గారు ప్రతిపక్ష నేతగా పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సంబంధించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని వాగ్ధానం చేశారు. అధికారంలోకి రాగానే దీనిపై నా నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పలుసార్లు చర్చలు జరిపింది. అనంతరం 2021లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాం. దాని ప్రకారం ఎస్ఇజెడ్‌కు రిజిస్టర్ చేయకుండా ఉన్న 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆరు గ్రామాలను తరలించాలనే ప్రతిపాదనను విరమించాలని, శ్రీరాంపురం, బండిపేట, ఉమ్మడివారికోడు, రావివారికోడు, రామరాఘవాపురం, తాటివారిపాలెం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని కమిటీ సిఫార్స్ చేసింది. అంతకు ముందు భూసేకరణలో భాగంగా స్మశానాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలను కూడా తీసుకున్నారు. సేకరించిన శ్మశాన భూములను అప్పగించాలని,  2180 ఎకరాల రైతుల భూమిని నిషేదిత జాబితా 22ఎ నుంచి తొలగించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిఫార్స్ చేశాం. వీటిని జగన్ గారి నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది.

వేగంగా రైతులకు తిరిగి భూములు ఇప్పించేందుకు కృషి
సీఎంగా వైఎస్‌ జగన్ ఎస్ఇజెడ్ బాధిత రైతుల కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు తీసుకున్నారు. ఎసిఇజెడ్ కోసం కోనా గ్రామానికి సంబంధించి 657 ఎకరాల అసైన్డ్ ల్యాండ్  ఇచ్చిన రైతులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, దివీస్ కోసం కేటాయించిన భూములకు కూడా అదనంగా అయిదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా ఉన్న హెచరీలకు భద్రత కల్పించాలని, స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వం సూచించింది. కేంద్ర నోటిఫికేషన్ పరిధిలో ఎస్ఇజెడ్ అనేది ఉంటుంది. దీనిని కేంద్రం నోటిఫికేషన్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో అధికారులు కేంద్రంతో సంప్రదించి సర్వే నెంబర్ల వారీగా భూములను ఉపసంహరింపచేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల వరకు విత్ డ్రా చేయించారు. భూ యాజమాన్య, వారసత్వ సమస్యలను కూడా సమగ్రంగా పరిశీలించి రైతులకు రిజిస్టర్ చేయించాలని కూడా సిఫారస్ చేశాం.

రైతులకు మేలు చేసిన వైఎస్‌ జగన్‌పై ఈనాడు బురద
దేశంలోనే మరెవ్వరూ రైతుల కోసం ఇంతగా చేయలేదు. ఎస్ఇజెడ్ కోసం బలవంతంగా చేస్తున్న భూసేకరణను నిలువరించి, రైతులకు భూములను తిరిగి ఇప్పించిన ఘనత సీఎంగా ఆనాడు వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. బాధిత రైతుల బాధలు తీర్చేందుకు ఆనాడు కన్నబాబు కమిటీ ఇంత కృషి చేస్తే.. రైతులను మోసం చేశారు అంటూ ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. రైతులు తమకు తిరిగి దక్కిన భూమిని వారి అవసరాల కోసం ఇతరులకు అమ్ముకున్నారు.

దాడిశెట్టి రాజా, పిఠాపురంకు చెందిన కొందరు ఈ భూములను కొనుగోలు చేసి ఉంటారు. అంతమాత్రాన రైతులను బెదిరించి భూములను లాక్కున్నారంటూ బుదరచల్లుతారా? రైతులకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు ఇచ్చిన తరువాత కొనుగోలు చేయడం కూడా అక్రమమే అవుతుందా? రైతుల భూములను బలవంతంగా గుంజుకున్న చంద్రబాబు ఈనాడు దృష్టిలో గొప్ప నాయకుడు. రైతుల బాధను చూసి వారికి అండగా నిలిచిన జగన్ గారు మాత్రం రైతులకు అన్యాయం చేసినట్లుగా ఈనాడు చిత్రీకరించడం వారి దిగజారుడుతనంకు నిదర్శనం.

కాకినాడ డీప్ సీ పోర్ట్ పైనా చంద్రబాబు మార్క్ కుటిల రాజకీయం
కాకినాడ సీ పోర్ట్ లో రెండు కంపెనీల మధ్య వాటాల కొనుగోలును చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి లావేదేవీలు ఎప్పుడూ జరగలేదా? కేవీ రావును బెదరించి  వాటాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అలా అయితే మొత్తం వాటాలు తీసుకునేవారు కాదా? కేవలం 41 శాతం తీసుకుని, మిగిలినవి కెవి రావు చేతుల్లోనే ఉంచుతారా? నేటికీ కేవీ రావు చేతుల్లోనే సీపోర్ట్ యాజమాన్యం ఉంది. అజమాయిషీ వారిదే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు బలవంతంగా వాటాలు గుంజుకున్నారని ఎందుకు కేవీరావు ఆనాడు ఫిర్యాదు చేయలేదు.

కేవీరావుకు సీపోర్ట్ కట్టబెట్టడంలో చంద్రబాబు కుట్ర
కాకినాడ సీపోర్ట్ ను సైతం చంద్రబాబు కుట్రపూరితంగానే కేవీ రావుకు దక్కేలా చేశాడు. 1997లో ప్రభుత్వ సొమ్ముతో నిర్మించి దాన్ని బ్యాక్ డోర్‌ ద్వారా కేవీరావుకు చంద్రబాబు అప్పనంగా అప్పగించేశారు. సీపోర్ట్ నిర్వహణకు ముందుగా విదేశీ కంపెనీలను తీసుకువచ్చి, కేవీరావు సంస్థలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత విదేశీ సంస్థలను వెళ్ళగొట్టి, మొత్తం కేవీ రావు సంస్థలకే దారాదత్తం చేశారు.

యాంకరేజీ పోర్ట్ ను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంటే, సీపోర్ట్ మాత్రం కేవీరావు సంస్థకు ఇవ్వడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన కేవీ రావుకు పోర్ట్ వ్యాపారాల్లో ఎటువంటి అనుభవం లేదు. అటువంటి వ్యక్తితో ఇప్పుడు చంద్రబాబు బలవంతంగా వాటాలు తీసుకున్నారు అని ఫిర్యాదు చేయిస్తున్నాడు.  బలవంతగా తీసుకుంటే… మైనర్‌ వాటా తీసుకుంటారా? పైగా వాటాలు అమ్ముకుని, దానికి డబ్బులు తీసుకుని, ఆడబ్బును వేరేచోట పెట్టబుడి దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లి, తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్ముతారా? పోర్టును కొట్టేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది.

పెట్టబడులకు, కట్టుకథలకు పుట్టిన విష పుత్రికలు అన్న శ్రీశ్రీ మాటలను ఈనాడు పత్రిక గుర్తు చేస్తోంది. కాకినాడ యాంకరేజీ పోర్ట్ నుంచి ఎక్కువగా  బియ్యం ఎగుమతి అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్‌లు ఈ పోర్ట్ ను తనిఖీ చేసిన తరువాత అరబిందో సంస్థ డీప్ సీ పోర్ట్ లో వాటాలు తీసుకున్న తరువాత నుంచే పీడీఎస్ బియ్యంను ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేయడం ఎక్కువైందని ప్రకటనలు చేశారు. డీప్ సీ పోర్ట్ యాజమాన్యం కేవీ రావు చేతుల్లోనే ఉంది. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు.

రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు తెలుగుదేశం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు. ఇవ్వన్నీనిజాలు అయితే, వైఎస్ఆర్ సిపిపై బుదరచల్లేలా వారు అబద్దాలు మాట్లాడటం, దానికి ఈనాడు పత్రిక బాకా ఊదడం దారుణం. 2019లో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఏం మాట్లాడారో మరిచిపోయారా? కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement