తెలంగాణ కడుపు కొడుతోంది!

KTR Open Letter To Amit Shah - Sakshi

కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ధ్వజం

మేం కేంద్రం కడుపు నింపుతున్నా కక్ష పెంచుకుంటున్నారు

అమిత్‌షాకు 27 ప్రశ్నలతో కేటీఆర్‌ బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా, తాము కేంద్రం కడుపు నింపుతున్నా.. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై ఇంకా కక్ష పెంచుకుంటూ కడుపు కొడుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే బీజేపీ నాయకులకు ఉపన్యాసాల్లో విషం చిమ్మి పత్తా లేకుండా పోవడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్‌ 27 ప్రశ్నలను సంధిస్తూ శుక్రవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అమిత్‌ షా తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్‌ చేశారు. ‘తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు ఇవ్వని హామీలను కూడా ఆగమేఘాల మీద అమలు చేస్తోంది.

ఆత్మగౌరవాన్ని, పోరాటాలతో సాధిం చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది. విభజన చట్టంలోని హామీలను కేంద్రం దృష్టికి తేవడంతో పాటు వాటి అమలు కోసం తెగేదాక కొట్లాడటం మా బాధ్యత. గుజరాత్‌పై ప్రేమను, తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ఇలాగే కొనసాగిస్తే తెలంగాణ ప్రజా క్షేత్రంలో మూల్యం చెల్లించుకుంటారు..’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.

కేటీఆర్‌ సంధించిన ప్రశ్నలివే..
► పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభ జన చట్టంలోని హామీలను.. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత ఒక్కటైనా నెరవేర్చిందా?
► దశాబ్దాలుగా ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ డిమాండ్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకొంది వాస్తవం కాదా?
► రూ.20 వేల కోట్లతో మీ సొంత రాష్ట్రం గుజ రాత్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టాలనే నిర్ణయం తెలంగాణపై చిన్నచూపునకునిదర్శనం కాదా?
► ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఐఐఎం, ఐసెర్, ఎన్‌ఐడీ, ట్రిపుల్‌ ఐటీ, గిరిజన యూనివర్సిటీ, నవోదయ విద్యాలయాల్లో ఒక్కటీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు?
► అడ్మిషన్‌ విషయంలో గుజరాత్‌లో ఓ వైద్య విద్యార్థికి అన్యాయం జరిగిందని బాధ పడిన మోదీకి.. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వకపోవడంతో లక్షలాది మంది వైద్య విద్యకు దూరం కావడంపై బాధ లేదా?
► బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ?
► తెలంగాణకు పారిశ్రామిక రాయితీలు ఎందు కు ఇవ్వడం లేదు?
► హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ (ఇంటిగ్రేటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్నాలజీ రీజియన్‌) రద్దు.. కుట్రకు పరాకాష్ట కాదా?
► ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ ఐటీ రంగంలో చేపడుతున్న అదనపు కార్యక్రమం ఏమిటి?
► ఐటీఐఆర్‌ రద్దుతో యువతకు ఉపాధి దక్కకపోవడంపై మీ సమాధానమేంటి?
► తెలంగాణకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు ఎందుకు ఇవ్వడం లేదు?
► పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు?
► రాష్ట్రానికి దక్కాల్సిన 575 టీఎంసీల సాగునీటి వాటాల కేటాయింపులపై బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయకుండా 8 ఏళ్లుగా తాత్సారం ఎందుకు? 
► కర్ణాటక అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం వివక్షకు నిదర్శనం కాదా?
► రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన నిధు లు కాకుండా ప్రత్యేకంగా ఇచ్చిందేమిటి?
► మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ.24 వేల కోట్ల గ్రాంటుకు నీతిఆయోగ్‌ చేసిన సిఫారసు ఎందుకు అమలు చేయడం లేదు?
► స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వకుండా ఎందుకుఇబ్బంది పెడుతున్నారు?
► మూసీ ప్రక్షాళనకు మూడు పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా?
► గుజరాత్‌కు వరద సాయం కింద వేల కోట్లు ఇచ్చి హైదరాబాద్‌కు నయా పైసా ఇవ్వకుండా ఎలా వస్తున్నారు?
► హైదరాబాద్‌ ఫార్మాసిటీకి సాయం ఎందుకు చేయడం లేదు?
► తెలంగాణకు డిఫెన్స్‌ కారిడార్‌ ఎందుకు మంజూరు చేయడం లేదు?
► మెగా టెక్స్‌టైల్‌ క్లస్టర్‌పై శీతకన్ను ఎందుకు?
► పంజాబ్‌ తరహాలో ధాన్యం కొనాలంటూ ఢిల్లీలోధర్నాచేసినా ఎందుకు స్పందించ లేదు?
► నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీ ఏమైంది?
► పెట్రో ధరలను తగ్గిస్తారా? లేదా?
► ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
► హైదరాబాద్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు సాయం చేయకుండా పోటీగా గుజరాత్‌లో మరో సెంటర్‌ను పెట్టింది వాస్తవమే కదా?  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top