కూటమిపై తిరుగుబాటు మొదలైంది! | KSR Comments Over Yellow Media And Red Book | Sakshi
Sakshi News home page

కూటమిపై తిరుగుబాటు మొదలైంది!

Apr 10 2025 11:31 AM | Updated on Apr 10 2025 11:57 AM

KSR Comments Over Yellow Media And Red Book

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వ అరాచకాలు, రెడ్‌బుక్‌ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డి పల్లిలో హత్యకు గురైన కురబ లింగమమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెళ్లిన సందర్భంగా ప్రజల ఆదరణ చూస్తే కూటమిపై వారి వ్యతిరేకత ఏమిటి? ఎంతస్థాయిలో ఉన్నదీ స్పష్టమవుతుంది.

వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం పన్నిన అన్ని కుట్రలూ ఇక్కడ విఫలమయయ్యాయి. పోలీసులు సృష్టించిన అడ్డంకులన్నింటినీ తొలగించుకుని మరీ జనసందోహం ఒక సునామీలా జగన్‌కు తన మద్దతు తెలిపింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలతో జగన్‌ పర్యటన విజయవంతమైంది. ప్రజాగ్రహంపై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ అయ్యింది!.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు ఇప్పటివరకూ నెరవేర్చకపోవడం.. వీటి గురించి ప్రశ్నించిన వారిని రెడ్‌బుక్‌ పేరుతో అణచివేతకు గురి చేస్తూండటం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం. రాష్ట్రస్థాయి నాయకులు ఒక చిన్న గ్రామానికి వెళితే ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల వారు వెళ్లడం పరిపాటి. కానీ, జగన్‌ పాపిరెడ్డి పల్లి పర్యటనలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే  ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం తీవ్రత ఏమిటో తేటతెల్లమవుతుంది. జగన్ కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తుంటే తెలుగుదేశం వారి గుండెలలో  రైళ్లు  పరుగెత్తి ఉండాలి. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వందల మంది పొలాలకు అడ్డం పడి మరీ పరుగులు తీసుకుంటూ రావడం కనిపిస్తుంది. ప్రత్యేకంగా సభ ఏమీ లేకపోయినా, ఈ స్థాయిలో జగన్ అభిమానులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, లోకేశ్‌ల ప్రభుత్వ అరాచకపు పాలనపై నిరసనను చెప్పడానికే అన్నది స్పష్టం.

వైఎస్‌ జగన్‌ మాజీ సీఎం అయినప్పటికీ ఆయనకు తూతూ మంత్రంగా కల్పించిన భద్రత కూడా ఈ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరుపై పలు విమర్శలకు కారణమైంది. జగన్ వచ్చిన హెలికాఫ్టర్ వద్దకు జనం చొచ్చుకుపోయారంటే పోలీసుల సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఒక  సబ్ ఇన్‌స్పెక్టర్ అంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా మొదటి పేజీలో ప్రచురించడాన్ని బట్టి ఏపీలో ఉన్నది పోలీసు రాజ్యం అని, కింది స్థాయి పోలీసులపై అధికారులకు కంట్రోల్ లేదని స్పష్టమవుతుంది. ఇది ఆ ఎస్‌ఐ క్రమశిక్షణ రాహిత్యమైనప్పటికీ రెడ్‌బుక్‌ పాలనలో అలాంటివారికి ప్రోత్సాహం లభిస్తుండటం దురదృష్టకరం. ఆ ఎస్‌ఐ గత ఎన్నికలలో టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించి, లోకేశ్‌తో సహా పలువురు టీడీపీ నేతలను కలిశారని స్పష్టమైనప్పటికీ అధికారులు ఎలాంటి చర్య  తీసుకోకపోగా, టీడీపీ ఎమ్మెల్యే కోరినట్లు పోస్టింగ్ ఇస్తే, అతను ఆ పార్టీ ఏజెంట్‌గా కాకుండా, ప్రజల కోసం పనిచేసే పోలీసుగా ఎందుకు వ్యవహరిస్తారు? ఇలాంటి వారు టీడీపీకి అనుకూలంగా పనిచేయరన్న గ్యారెంటీ ఏముంటుంది?.

పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు  ప్రస్తావించారు. ఏపీలో బీహారును  మించిన భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బీహారులో ఇలా రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై హింసకు దిగడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ మాదిరి మారవద్దని బీహారులో అక్కడి రాజకీయ పార్టీలు చెప్పుకోవాలి. తప్పుడు కేసులు ఎలా పెట్టాలి? ప్రతిపక్ష నేతలను, పార్టీ కార్యకర్తలను, సోషల్  మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని ఎలా వేధించాలి? సినీ నటులను సైతం వదలకుండా ఒకటికి ఇరవై కేసులు పెట్టి, వందల కిలోమీటర్ల దూరం ఎలా నిత్యం తిప్పాలి? ఎప్పుడో ఏదో జరిగిందని, ఏళ్ల తర్వాత మనోభావాలు గాయపడ్డాయంటూ చిత్రమైన కేసులు ఎలా పెట్టాలి? అన్న వాటిలో ఏపీ పోలీసులు ఆరితేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పిచ్చి పాలన ఏపీలో మాత్రమే ఉంటుందేమో!.

వైఎస్‌ జగన్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా రెడ్‌బుక్ పాలన సాగుతోందని అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యలకు గురైన తీరు, వారి వివరాలు, తప్పుడు కేసులలో రోజుల తరబడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను జైళ్లలో నిర్భంధిస్తున్న విధానం, స్థానిక ఉప ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యకాండ, బలం లేకపోయినా పోలీసుల సాయంతో గెలవాలన్న దుర్నీతి, మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు. వాటిలో ఒక్కదానికైనా ప్రభుత్వపరంగా మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ, గత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలను పక్కనబెట్టి, పోలీసులపై జగన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ టూర్‌ను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా ఒకటే  ఏడుపుతో కధనాలు ఇచ్చిందని చెప్పాలి.

పచ్చ చొక్కాలతో పనిచేసే పోలీసుల బట్టలూడదీస్తామని, అధికారంలోకి వచ్చాక చట్టం ముందు నిలబెడతామన్నది జగన్ భావన అయితే ఏదో రకంగా పోలీసులలో తప్పుడు అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వార్తలు ఇచ్చాయి. తమ ఏడుపుగొట్టు వార్తల ద్వారా జగన్ టూర్‌కు జనం అశేష సంఖ్యలో వచ్చారని ఎల్లో మీడియా పరోక్షంగా అయినా ఒప్పుకోక తప్పలేదు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు, అచ్చెన్నాయుడు తదితరులు విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు, దూషణలు  చేసింది అందరికీ తెలుసు. లోకేశ్‌ అయితే  రెడ్ బుక్ పేరుతో జిల్లా ఎస్పీలనే బెదిరిస్తూ చేసిన ప్రకటన సంగతేమిటి?.

పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలోనే  పోలీసుల వ్యాన్‌ పైనే రాళ్లదాడి చేసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నుపోతే కనీసం సానుభూతి అయినా చూపిందా?. అచ్చెన్నాయుడు కుప్పంలో పోలీసులను బూతులతోనే దూషించారే. ఈ ఎల్లోమీడియా అసలు ఆ ఘటనలపై వార్తలనైనా ఇచ్చిందా?. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్లు అధికార టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తుంటే, వారికి ఎల్లో మీడియా భజన చేస్తోంది. ఏది ఏమైనా జగన్ టూర్ ద్వారా ఒక విషయం బోధపడుతుంది. రెడ్ బుక్ అన్న దానిని ఒక పిచ్చికుక్క మాదిరి ఎంత ఎక్కువగా ప్రయోగిస్తే ప్రజలలో అంత నిరసన వస్తుందని, అంత స్థాయిలో తిరుగుబాటు వస్తుందని తేలింది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement